
వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం వైఎస్ జగన్ కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు మాజీ మంత్రి కొడాలి నాని. నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని క్యాంప్ కార్యాలయంలో కలిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసాడు. కొడాలి నాని వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వైఎస్ వివేకానంద రెడ్డి బ్రతికి ఉన్నా లేకపోయినా కడప ఎంపీ సీటు ఆయనకు ఇచ్చేవాడు కాదని , అవినాష్ రెడ్డికి మాత్రమే ఇచ్చేవాడని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి జగన్ రాజీనామా చేసినప్పుడు కడప ఎంపీగా పోటీ చేసినప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డితో పాటుగా ఆయన కుటుంబం జగన్ ను ఓడించడానికి , ఆయన్ని నాశనం చేయడానికి చూసిందని దుయ్యబట్టాడు.
జగన్ పార్టీ అధినేత కాబట్టి పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలో ఆయన మాత్రమే నిర్ణయించుకుంటారని , జగన్ పోటీ చేసినప్పుడు అవినాష్ రెడ్డి తో పాటుగా ఆయన కుటుంబం జగన్ కు అండగా నిలిచిందని , కానీ వివేకానంద కుటుంబం మాత్రం జగన్ ను నాశనం చేయాలని చూసిందన్నాడు. అందుకే కడప ఎంపీ సీటు వైఎస్ అవినాష్ రెడ్డికి ఇచ్చాడని అన్నాడు కొడాలి నాని. ఈ వ్యాఖ్యలతో రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. 2019 లో ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే.