గన్నవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద అలాగే నారా లోకేష్ మీద తీవ్ర పరుష పదజాలం ఉపయోగిస్తున్నారు వల్లభనేని వంశీ , కొడాలి నాని. ఈ తతంగం గతకొంత కాలంగా సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా నారా లోకేష్ పై మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. దాంతో అతడి వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది.
ఆ నిరసన కార్యక్రమాలతో వల్లభనేని వంశీ అనుచరులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆ కోపంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. ఆఫీసులోకి దూరి ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. అలాగే పార్టీ ఆఫీసు ముందున్న కారు తగులబెట్టారు. ఫ్యూయల్ ట్యాంక్ పేలడంతో భారీ విస్ఫోటనం జరిగింది. దాంతో భయాందోళనకు గురయ్యారు ప్రజలు.
ఇరు వర్గాల కార్యకర్తలు రాళ్లతో , కర్రలతో దాడులు , ప్రతి దాడులు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఇరు వర్గాల దాడులతో గన్నవరం రణరంగంగా మారింది. అయితే ఈ గొడవలకు నాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నాడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.