విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని గతకొంత కాలంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. తరచుగా టీడీపీ పై అలాగే అధినేత చంద్రబాబు పై విమర్శలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి టీడీపీ పార్టీపై అలాగే చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు. చంద్రబాబు నాకు టికెట్ ఇవ్వకపోయినా నష్టం లేదు.
నేను మళ్ళీ పార్లమెంట్ కు పోటీ చేయబోవడం లేదు అంటూ కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని, అవసరమైతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని కుండబద్దలు కొట్టాడు. కొంతమంది ఎన్నికలు రాబోతున్నాయి కదా అని రకరకాల ట్రస్ట్ ల పేరుతో సేవా కార్యక్రమాలకు తెరలేపారని, అలాంటి వాళ్ళు ఎన్నికలు అయ్యాక కనుమరుగు అవుతారని …… కానీ నేను మాత్రం వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేశాడు.
మోడీ సభలో ఉండగానే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడానని , నా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఆగిపోయాయా ? అంటూ ప్రశ్నించాడు కేశినేని నాని. నా నియోజకవర్గ పరిధిలోని 350 గ్రామాలను దత్తత తీసుకొని మరీ అభివృద్ధి చేస్తానని , అలాగే చంద్రబాబు టికెట్ ఇవ్వకున్నా పోటీ చేస్తానని సంచలనం సృష్టించాడు. గతకొంత కాలంగా కేశినేని నాని టీడీపీకి కొరకరాని కొయ్యగా మారాడు. అధినేత పై అవకాశం చిక్కినప్పుడల్లా ఆగ్రహ వ్యక్తం చేస్తూనే ఉన్నాడు.