2024 లో భారత పార్లమెంట్ కు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏపీలో టీడీపీ – బీజేపీ పొత్తు ఖాయమైందని జాతీయ మీడియా సంస్థల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఈ ప్రచారంపై అటు టీడీపీ కానీ ఇటు బీజేపీ కానీ ఖండించలేదు దాంతో పొత్తు ఖాయమనే భావిస్తున్నారు. గతంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టగా అప్పట్లో ఎన్డీయే కన్వీనర్ గా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు.
ఆ తర్వాత 2014 లో కూడా బీజేపీ – టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టింది. కట్ చేస్తే 2018 లో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం లేదని మోడీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ కి గుడ్ బై చెప్పాడు చంద్రబాబు. అంతేకాదు మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో విపక్షాలను ఒక్కతాటి పైకి తీసుకొచ్చాడు చంద్రబాబు. అయితే 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు అధికారం కోల్పోయాడు. దాంతో ఇక చంద్రబాబు, మోడీ కలిసే అవకాశం లేదని అనుకున్నారు.
కట్ చేస్తే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు , శాశ్వత మిత్రులు ఉండరని మరోసారి చాటి చెప్పనున్నారు మోడీ – చంద్రబాబు. ఎన్డీయే పక్షం నుండి పలు పార్టీలు బయటకు వెళుతుండటంతో కాస్త కలవరపడిన బీజేపీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఏపీలో టీడీపీ తో పొత్తు పెట్టుకుంటేనే మంచిదనే నిర్ణయానికి వచ్చారట బీజేపీ కేంద్ర నాయకులు. త్వరలోనే ఈ పొత్తు పై అధికారిక ప్రకటన రావడం ఖాయమని తెలుస్తోంది.