
తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికలు బూస్ట్ నిచ్చాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్యంగా రెండు స్థానాలను కైవసం చేసుకుంది. దాంతో తెలుగుదేశం పార్టీలో ఎనలేని ఉత్సాహం ఉరకలు వేస్తోంది. వైసీపీ అరాచకాలను ఎదుర్కోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా అందుకు సరైన ఊతం లభించడం లేదని మదన పడుతున్న సమయంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో సరికొత్త జోష్ ను నింపాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 9 జిల్లాలు అందునా 100 కు పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే ఇదే ఫలితాలు 2024 లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వస్తాయని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
175 కు 175 అసెంబ్లీ స్థానాలు గెలవాల్సిందే అని లక్ష్యంగా పెట్టుకున్న జగన్ కు మాత్రం ఈ ఎన్నికలు దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసాయి. ఇక ఉత్తరాంధ్ర , రాయలసీమ జిల్లాలకు చెందిన మంత్రుల ఒంట్లో వణుకు మొదలైందట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సాధించిన విజయంతో ఎన్నారైలు చాలా సంతోషంగా ఉన్నారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సంబరాలు చేసుకుంటున్నారు.