Jagan ఏపీలో రోడ్ల పరిస్థితిపై గత కొంతకాలంగా చర్చ కొనసాగుతున్నది. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఏపీ సర్కారును ఒక ఆట ఆడుకుంటున్నారు. వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ మన అద్భుత పాలన అంటూ జగన్ సర్కారును తిట్టిపోస్తున్నారు. అధ్వాన రహదారులతో తాము పడుతున్న ఇబ్బందిని తెలియజేస్తూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఇక మరికొందరు తమ నాలెడ్జ్ కు పదును పెడుతూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ, జనసేన శ్రేణులు వీటిని బాగా ట్రోల్స్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది.
ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్యానంగా ఉందని జనం మొత్తుకుంటున్నారు. అయినా ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెబుతూ అభివృద్ధి విషయంలో పట్టనట్లుగా వ్యవహరిస్తు్న్నది. పట్టణాల్లో కూడా రోడ్ల పరిస్థితి ఇలా ఉందంటే ఇక పల్లెల మాట దేవుడెరుగు. గతంలో పవన్ కళ్యాణ్ స్వయంగా రోడ్లపై మొక్కలు నాటి తన నిరసన తెలిపారు. పలుచోట్ల గుంతలను పూడ్చి తన దైన శైలిలో నిరసన తెలిపారు. అక్కడక్కడా వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, యువకులు స్వయంగా శ్రమదానం చేస్తూ గుంతలను పూడుస్తు్న్నారు. ఏపీలో వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైందని ప్రజలు మండిపడుతున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం అధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ తో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఏపీలో రోడ్ల పరిస్థితిపై మాట్లాడారు.
ఇప్పుడు ఇవి కూడా నెటిజన్లకు ట్రోల్స్ కు దొరికాయి. చిన్నజీయర్ స్వామి రాజమహేంద్ర వరంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు రాగా, దారిలో రోడ్ల పరిస్థితి చూసి ఆయన కామెంట్ చేశారు. జీవిత ప్రయాణంలో ఒడిదుడుకులు ఎక్కువయ్యాయంటూ ఏపీలో రోడ్ల పరిస్థితిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అదేస్థాయిలో సెటైర్ వేశారు. తన స్నేహితుడెవరో తెలంగాణ ప్రజలను నాలుగు బస్సుల్లో ఏపీకి పంపిస్తే ఇక్కడి రోడ్ల పరిస్థితి అర్థమవుతుందని, తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి ఏంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. పక్క రాష్ర్టంలో నీళ్లు, కరెంట్, రోడ్లు దారుణంగా తయారయ్యాయని చెప్పారు.
ఏదైతేనేం ఏపీలో రోడ్ల పరిస్థితిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. విపక్షాల డిజిటల్ క్యాంపెయిన్ పుణ్యమాని ఈ వీడియోలు, ఫొటోలు మరింత సెటైర్లతో ప్రజల ముందుకు వస్తున్నాయి. జగన్ వల్ల మెకానిక్ లకు ఉపాధి దొరికిందని కొందరు, ఒలింపిక్స్ లో లాంగ్ జంప్ లకు ఈ గుంతలు ఉపయోగ పడుతున్నాయని మరికొందరు, డెలీవరి బాయ్స్ గమ్యస్థానానికి చేరుకోవాలంటే ఫుడ్డు పాడైపోతున్నదని, గుంతలో పడి ప్రేమించుకుంటున్న లవర్స్ అంటూ ఇలా పెద్ద సంఖ్యలో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇక కామెడీ బ్రహ్మ బ్రహ్మనందం ఫొటోలు, వీడియోలతో మీమ్స్ అయితే చెప్పలెనన్ని వస్తున్నాయి. ఏపీ ప్రజలను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
ముఖ్యంగా మంత్రుల నియోజకవర్గాల్లోనూ రోడ్ల పరిస్థితి అతి దారుణంగా ఉందంటూ ట్రోల్స్ కొనసాగుతున్నాయి. అన్న వస్తున్నాడు.. రోడ్లు బాగవుతాయి అంటూ జగన్ పై సెటైరికల్ వీడియో ఒకటి బాగా సర్క్యూలెట్ అవుతున్నది. ఏదేమైనా జగన్ సర్కారును సోషల్ మీడియా కుర్రాళ్లు బాగా ఆడేసుకుంటున్నారు. ఒక్క చాన్స్ ప్లీజ్.. ఒక్క గుంత ప్లీజ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో కోనసీమ జిల్లాలోని ఒక రోడ్ల పరిస్థతిపై జన సేన అధినేత ఒక రహదారి వీడియోను పోస్టు చేస్తే ట్విట్టర్లో కోట్లాది మంది వీక్షించారు. రీ ట్వీట్ చేస్తూ వైసీపీ సర్కారును ఒక గేమ్ ఆడుకున్నారు.