
గతకొంత కాలంగా వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని, జనసేన పార్టీలో చేరనున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో వంగవీటి పాల్గొనలేదు. ఇంకేముంది పార్టీ మార్పు ఖాయమే అని అనుకున్నారు అంతా. అయితే ఈ ఊహాగానాలు మరింత ఎక్కువై తన ఇమేజ్ డ్యామేజ్ కాకముందే సర్దుబాటు చేసుకోవాలని భావించి అన్నమయ్య జిల్లా పీలేరుకు పయనమయ్యాడు వంగవీటి రాధా.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ లో మళ్లీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని , పూర్వ వైభవం కోసం పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 400 రోజుల పాటు ప్రజల్లోనే ఉంటానని ప్రతిజ్ఞ చేసి మరీ పాదయాత్ర ప్రారంభించాడు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని పీలేరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో లోకేష్ పాదయాత్ర సాగుతోంది. అక్కడకు చేరుకున్నాడు వంగవీటి రాధా. నారా లోకేష్ తో చర్చించిన అనంతరం కొద్ది దూరం లోకేష్ తో కలిసి పాదయాత్ర చేసాడు వంగవీటి. నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొని తనపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాడు వంగవీటి రాధా. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా , వంగవీటి మోహన్ రంగా వారసుడిగా వంగవీటి రాధాకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే.