
ఇక మా రాజధాని వైజాగ్ మాత్రమే అని కుండబద్దలు కొట్టాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్న జగన్ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి గట్టి ప్రయత్నాలే చేసాడు. త్వరలోనే అందరం వైజాగ్ లో కలుద్దామని , ఇక నుండి మా రాజధాని వైజాగ్ అంటూ అసలు విషయాన్ని చెప్పేసాడు. త్వరలోనే వైజాగ్ లో సమావేశం నిర్వహిస్తామని అక్కడే కలుసుకుందామన్నాడు.
ఏపీలో మూడు రాజధానుల అంశం గతకొన్నాళ్ళుగా మరుగున పడిన సంగతి తెలిసిందే. అమరావతి శాసనసభ సమావేశాల రాజధానిగా , వైజాగ్ పరిపాలన రాజధానిగా ఇక కర్నూల్ న్యాయ రాజధానిఅని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసాయి. అంతేకాదు ఏపీ హైకోర్టును కూడా ఆశ్రయించాయి. ప్రతిపక్షాలకు అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. దాంతో సుప్రీం కోర్టును ఆశ్రయించింది జగన్ ప్రభుత్వం.
మరో రెండు నెలల్లోనే వైజాగ్ నుండి పరిపాలన కొనసాగించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది జగన్ ప్రభుత్వం. భీమిలి రోడ్డు లో ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా ఉన్నాయి దాంతో దాంట్లో సెక్రటేరియట్ , సీఎం క్యాంప్ ఆఫీస్ తదితర వాటికి కేటాయించేలా ప్లాన్ చేస్తున్నారు.






