కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న సమయంలో షాక్ ఇచ్చారు ఢిల్లీ మున్సిపల్ అధికారులు. భారత్ రాష్ట్ర సమితి కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తున్న శుభ సందర్బంగా ఢిల్లీలోని ప్రధాన రోడ్ల పై పెద్ద ఎత్తున గులాబీ శ్రేణులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు. అయితే ఎలాంటి అనుమతి లేకుండా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో స్పందించిన మున్సిపల్ అధికారులు వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేయడంతో మున్సిపల్ సిబ్బంది కేసీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. కొత్త కార్యాలయం ప్రారంభం రోజున ఇలాంటి పరిస్థితి తలెత్తడంతో గులాబీ శ్రేణులు షాక్ అయ్యారు.
డిసెంబర్ 14 న ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి ( BRS ) కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తుండటంతో పాటుగా రాజసూయ యాగం కూడా నిర్వహిస్తున్నారు కేసీఆర్. ఈ యాగం రెండు రోజుల పాటు జరుగనుంది. రాజసూయ యాగం లక్ష్యం నెరవేరుతుందని భావిస్తున్నాడు కేసీఆర్. గతంలో కూడా పలుమార్లు కేసీఆర్ యాగం చేసిన విషయం తెలిసిందే.