Kodali Nani : ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. రోజుకో మలుపు, గంటకో ఎత్తుగడ అన్నట్టుగా పార్టీలు ముందుకెళ్తున్నాయి. వైసీపీ, టీడీపీ కూటమి మధ్య ప్రధానంగా పోరు సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తి అయ్యింది. వైసీపీలో మార్పులు, చేర్పుల ప్రక్రియ పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు టీడీపీ, జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు. పలు నియోజకవర్గాల్లో వైసీపీకి సిట్టింగ్ లు ఝలక్ ఇస్తున్నారు. వీటిలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గం కూడా ఒకటి.
అన్ని నియోజకవర్గాల్లో కెల్లా ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారడానికి కారణం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరడమే. టికెట్ ఇస్తామనే హామీతోనే వసంత టీడీపీలో చేరినట్లు సమాచారం. అయితే టీడీపీలోకి వసంత రాకను దేవినేని ఉమా, ఆయన అనుచరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వసంత చేరిక సమయంలోనూ ఉమా కనిపించకపోవడం గమనార్హం. వసంతను పార్టీలో చేర్చుకోవద్దని గతంలోనే చంద్రబాబుకు ఉమా చెప్పినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఉమా మాటలను పట్టించుకోకుండా వసంతను పార్టీలో చేర్చుకున్నారు. ఇదే సమయంలో ఆయన చేరికను వ్యతిరేకిస్తూ తన అనుచరులతో కలిసి ఉమా తిరుగుబాటు చేశారు. శంఖారావం పేరుతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఎవరో వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సహకరించేది లేదని ఉమా అనుచరులు, టీడీపీ కార్యకర్తలు తెగేసి చెప్పారు. ఉమాను కాదని మరో వ్యక్తికి మైలవరం టికెట్ అప్పగిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. టీడీపీలోకి వసంత రాకను ఉమానే కాకుండా బొమ్మసాని సుబ్బారావు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అయితే టీడీపీ పరిస్థితి ఇదిలా ఉండగా..వైసీపీ అధినేత కొత్త ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. వైసీపీని కాదని టీడీపీలో చేరిన వసంతను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓడించాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. దీని కోసం భారీ స్కెచ్ వేసినట్టు చెబుతున్నారు. మైలవరం వైసీపీ అభ్యర్థిగా కొడాలి నానిని బరిలో దించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వసంతపై రివేంజ్ తీసుకోవాలంటే నాని అయితేనే కరెక్ట్ అని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. గుడివాడలో వైసీపీ తరుపున ఎవరిని పెట్టినా సునాయసంగా గెలిచే అవకాశముందని, నానిని మైలవరం నుంచి పోటీ చేయిస్తే అక్కడా, ఇక్కడా గెలవచ్చని జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.
ఇటీవల మైలవరం నుంచి వల్లభనేని వంశీ బరిలోకి దిగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. గతంలో వైసీపీ ఆరో జాబితా విడుదల చేసినప్పుడు మైలవరం ఇన్ చార్జిగా తిరుపతిరావు యాదవ్ ను నియమించింది. అయితే మారిన పరిణామాలతో వల్లభనేని వంశీని బరిలోకి దించుతారని భావించారు. కానీ వీరిద్దరూ కాకుండా కొడాలి నానిని బరిలోకి దించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.