Revanth reddy తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ జోష్ లో ఉన్నట్లు కనిపిస్తున్నది. ప్రస్తుతం బీఆర్ఎస్ ను బలంగా ఢీకొట్టే సత్తా కేవలం కాంగ్రెస్ కే ఉందని తేలిపోయింది. ఈ రేసులో బీజేపీ దాదాపు వెనుకపడిపోయింది. కాదు.. కాదు సైలెంట్ అయిపోయింది. అయితే బీజేపీ వ్యూహం ఏంటనేది ఇప్పటివరకు ఎవరికీ అర్థం కావడం లేదు. కొంతకాలం పాటు బీఆర్ఎస్ ను ఢీకొట్టే స్థాయిలో బీజేపీ పుంజుకుంది. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో మంచి ఊపు మీద కనిపించింది. కానీ ఒక్క సారిగా అధికార బీఆర్ఎస్ మీద పోరు ను తగ్గించింది. అయితే ఈ రేసులో కాంగ్రెస్ దూసుకువచ్చింది.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత ఒక్కసారిగా అందరిచూపు హస్తం పార్టీ వైపు మళ్లింది. అయితే టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక తెలంగాణ కాంగ్రెస్ లో జోరు పెరిగింది. అధిష్టానం కూడా ఆయనపై నమ్మకంతో, ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఆయనకు బాధ్యతలను అప్పగించారు. అయితే ఆయనకు సీనియర్ల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. రేవంత్ రెడ్డిని విమర్శించడమే కొందరు పనిగా పెట్టుకొని ఎదుటి పార్టీకి లాభం చేకూరుస్తున్నారు. తాము ముందు నుంచి పార్టీలో ఉన్నామని, జూనియర్ అయిన రేవంత్ రెడ్డి కి పగ్గాలు అప్పగించడంపై వారు కొంత నొచ్చుకున్న మాట వాస్తవమే అయినా, టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి మాత్రమే సమర్థవంతంగా పని చేయగలరు. అయితే ఇప్పుడు అదే జరుగుతున్నది.
అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కొందరు గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. అలేరు పరిధిలో ఒక మండలానికి మహిళను అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఆ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు దీనిపై గాంధీభవన్ లో ఆందోళనకు దిగారు. ఇదే రేవంత్ రెడ్డి కోపానికి కారణమైంది. ఇకపై పరిధి దాటితే వేటు వేస్తానని హెచ్చరించారు.
ఒక నాయకుడిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు కూడా. అయితే పార్టీ శ్రేణులను ఇలా బెదిరింపులకు గురిచేయడం సరికాదని, ప్రస్తుతం ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ గా ఆయన కొంత సంయమనం పాటించాలని అంతా భావిస్తున్నారు. అయితే పార్టీలో కొందరు నేతలు కావాలనే కుట్రలు చేస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకే కొందరు ద్వితీయ శ్రేణి నాయకులను ఇలా పురిగొల్పుతున్నారని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ప్రస్తుతం కఠినంగా వ్యవహరించకపోతే మొదటికే మోసం వస్తుందని భావిస్తున్నారు. కిందిస్థాయి కార్యకర్తలు ఆయనతో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. కొంతమంది నాయకులు మాత్రమే ఆయనను వ్యతిరేకిస్తున్నారు.
అయతే పీసీపీ చీఫ్ గా రేవంత్ రెడ్డికి కొన్ని అధికారాలు ఉంటాయి. ప్రస్తుతం పార్టీ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వబోతున్నదనేది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ శ్రేణులంతా కలిసికట్టుగా సాగితేనే పోరులో విజయం సాధ్యమవుతుంది. సీఎం ఎవరనే విషయం పక్కన పెడితే, శ్రేణులంతా ఆయా నియోజకవర్గాల్లో కలిసికట్టుగా సాగితేనే లాభం ఉంటుంది. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ బలం, బలహీనతను తెలుసుకోవాలి. పీసీసీ చీఫ్ గా ఇప్పటికే ఆయన ఒక సర్వే చేయించారని తెలుస్తున్నది. ఇందుకు వ్యూహకర్త సునీల్ కనుగోలు సహకారంకూడా అధిష్టానం ఇచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి కొన్ని పక్కా ప్రణాళికల ప్రకారమే ముందుకెళ్తున్నారు.
ఇటీవల కరెంట్ విషయంలో రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టామని బీఆర్ఎస్ భావించినా, నిజానికి 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని అధికార పార్టీనే అడ్డంగా దొరికిపోయింది. దానిపై బహిరంగ చర్చకు కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారు. దీనిపై బీఆర్ఎస్ ఇప్పటివరకు స్పందించలేదు. కేవలం కాంగ్రెస్ గత ప్రభుత్వాల్లో జరిగిన విషయాలనే తెరపైకి తెస్తున్నది. రేవంత్ రెడ్డి ఒక్కడినే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నది. మరి ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి ఒక్కడుగు ముందున్నట్లే కనిపిస్తున్నది. అధికార పార్టీకి టార్గెట్ అయ్యారంటేనే ఆయన సక్సెస్ అయ్యారు.
మరి రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి కొంత అచితూచి అడుగులు వేస్తేనే నెగ్గుకురాగలరు. ఎందుకంటే ముందున్నది కేసీఆర్. ఆయన రాజకీయ చతురత ముందు తట్టుకోవాంటే రేవంత్ రెడ్డి నెక్ట్స్ అడుగు ఎంటనేది కూడా అంచనా వేయడానికి ఎదుటివాళ్లకు అవకాశం ఇవ్వకూడదు. మరి ఇన్ని సవాళ్ల మధ్య రేవంత్ రెడ్డి ఎలా పార్టీని గెలుపు తలుపుల ముందు ఉంచుతారో వేచిచూడాలి.