- మళ్లీ సొంతగూటికేనా..
Rajagopal Reddy
Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నల్గోండ రాజకీయాల్లో కీలక వ్యక్తి.. కాంగ్రెస్ నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. ఇందుకోసం పార్టీ సభ్యత్వానికే కాకుండా మునుగోడు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు కారణమయ్యారు. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. తిరుగులేదని అనుకున్న చోటే ఓటమి పాలయ్యారు. కచ్చితంగా గెలిచి తీరుతానని నమ్మకంతో ఉన్న ఆయన ఓటమి పాలవడం సంచలనం రేపింది. ఇక అప్పటి నుంచి ఆయన సైలంట్ అయ్యారు. బీజేపీ కార్యక్రమాల్లోనూ కీలకంగా పని చేయడం లేదు.
రాష్ట్రంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో..
తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని తెచ్చి పెట్టింది. 2023 ఎన్నికలు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అనుకున్నవాళ్లంతా తమ లెక్క తప్పని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పోటీ కాంగ్రెస్ తోనని తేలిపోవడం, ఈ మేరకు బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా ప్రకటనలు చేస్తుండడం వారి పునరాలోచనకు కారణమైంది. కొంత కాలంగా కాంగ్రెస్ ను వీడి వెళ్లిన వారంతా మళ్లీ సొంతగూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తున్నది.
రేవంత్ అది చెబితేనే..
అయితే రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో సీరియస్ గా అనుచరులతో రెండు, మూడు రోజులుగా సమావేశమవుతున్నారు. వారి అభిప్రాయాన్ని తీసుకుంటున్నట్లు సమాచారం. మునుగోడులో తమ ఓటమికి రేవంతేరెడ్డినే కారణమని, ఆయన చేసిన కాంట్రాక్ట్ కామెంట్లే చేటు చేశాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి క్షమాపణ చెబితే కాంగ్రెస్ లోకి వెళ్లాలని కొందరు అనుచరులు ఆయనతో అన్నట్లుగా తెలిసింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి దేశ వ్యాప్తంగా అనుకూల పరిస్థితులు లేవని రాజగోపాల్ భావిస్తున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ పుంజుకుంటున్నదని, ఇప్పటికే పలు రాష్ర్టాల్లో బలమైన పవనాలు వీస్తున్నాయని ఆయన తెలుసుకున్నారు.
మరోవైపు తెలంగాణలో బలపడిందని, అందరం సమష్టి గా కలిసి సాగితే బీఆర్ఎస్ ను దీటుగా ఎదుర్కోవచ్చని భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే సోదరుడు, కాంగ్రెస్ పార్టీ కీలక నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో మాట్లాడి ఓ కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే రాజగోపాల్ రెడ్డి సొంత గూటికి చేరితే కాంగ్రెస్ కు మరింత బలం చేకూరుతుందని స్థానిక నేతలు భావిస్తున్నారు. మరి పీసీసీ చీఫ్ ఆయనను స్వాగతిస్తారా.. లేదా వేచిచూడాలి.