Target BRS అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో పొలిటిక్స్ మరింత హీటెక్కుతున్నాయి. ఒక్కసారిగా రాష్ర్టంలో రాజకీయ సమీకరణాలు మారాయి. రాష్ర్టంలో బీజేపీ మొన్నటి వరకు దూకుడుగా వ్యవహరించింది. ఆ పార్టీలో అంతర్యుద్ధం, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడి మార్పు తదితత కారణాలు కమలం పార్టీని వెనక్కి నెట్టేశాయి. అదే మొన్నటి వరకు తెలంగాణలో అసలు కాంగ్రెస్ ఉందా లేదా అనే పరిస్థితి.
కర్నాటకలో విజయం, రాష్ర్టంలో బీజేపీ స్తబ్ధత కాంగ్రెస్ కలిసొచ్చింది. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ చేరడం, మరి కొందరు బీఆర్ఎస్ అసంతృప్త నేతలు కూడా చేరుతారనే ప్రచారం హస్తం పార్టీకి బూస్ట్ అవుతున్నది. రాహుల్ గాంధీ సభ విజయంతం కావడం, దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఏకం అవుతున్న సమయలో బీఆర్ఎస్ ను కూటమిలో చేర్చుకోబోమంటూ రాహుల్ గాంధీ ప్రకటించడం కాంగ్రెస్ లో జోష్ నింపింది. దీంతో తెలంగాణలో అధికార పార్టీ కూడా కాంగ్రెస్ తమ ప్రధాన ప్రత్యర్థిగా ఫిక్సయ్యింది.
కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను మొన్నటి వరకు లైట్ గా తీసుకుంది. కానీ ప్రతి కామెంట్ కు బదులు చెప్పాలని బీఆర్ఎస్ కూడా నిర్ణయించుకుంది. నాలుగు రోజుల క్రితం తానా సభల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ధర్నాలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ను దోషి చూపే ప్రయత్నం చేసింది. దీనికి కాంగ్రెస్ కూడా కౌంటర్ గా అదే రోజు ధర్నాలు చేసి సవాల్ విసిరింది. అయితే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుడి వ్యాఖ్యలకు ధర్నా చేయడం ఏమిటనే వాదనా వినిపిస్తున్నది.
బీఆర్ ఎస్ ధర్నా చేయడాన్ని బట్టి కాంగ్రెస్ ను తమ ప్రధాన ప్రత్యర్థి గా భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే క్రమంలో బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నియామకమైన కిషన్ రెడ్డి రాష్ర్టంలో వంద రోజుల ప్లాన్ కు ప్రణాళికలు రూపొందించినా వాటి గురించి పెద్దగా చర్చ సాగడం లేదు. క్షేత్ర స్థాయిలో బీజేపీ కార్యక్రమాలు కూడా రూపొందించడం లేదు. రేవంత్ రెడ్డి రాష్ర్టానికి వచ్చాక కాంగ్రెస్ చేపట్టబోయే కార్యక్రమాలు ఎలా ఉంటాయో, బీజేపీ వంద రోజుల ప్లాన్ ఎలా ఉండబోతుందో చూడాల్సిందే.