
VRAs: రాష్ట్ర సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్న ఏదో ఒక పేచీ పెడుతూనే ఉంటుందనేది గత అనుభవాలను చూస్తే అర్థమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే విషయంలో మొదటి నుంచి కేసీఆర్ సర్కార్ ఇదే ధోరణిని అవలంభిస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ సమస్యలపై కూడా ప్రభుత్వం ఇలాంటి పద్ధతులనే కొనసాగిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సేవకులు దాదాపు 20 వేల మంది వరకు ఉంటారు. వీరిలో డైరెక్ట్‌గా రిక్రూట్ అయిన వారు చాలా తక్కువ మంది కాగా వారసత్వ పద్ధతిన పోస్టింగ్‌లు పొందిన వారే ఎక్కువ మంది ఉన్నారు.
అయితే వీఆర్ఏల పోస్టింగ్‌ల విషయంలో చాన్నాళ్లుగా ఓ చిక్కుముడి అలాగే ఉండిపోయింది. గతంలో వీఆర్ఏలుగా పోస్టింగ్ పొందిన హక్కుదారులు..వాటాదారుల మధ్య వివాదముంది. అప్పట్లో వాటదారుల్లో చదువుకున్న వారికే హక్కు పత్రాలు మంజూరయ్యాయి. దీంతో మిగిలిన వాటాదారులంతా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలోనే హక్కుదారులు తమకు పర్మినెంట్ పేస్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ..చాన్నాళ్లుగా ఆందోళనలు,నిరసనలు కొనసాగించారు. దీనికి ప్రతిగా వాటాదారులు కూడా కౌంటర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు.
ఇక వీరి సమస్య ఇలా ఉంటే కేసీఆర్ మాత్రం ఎన్నికలకు ముందు హక్కుదారులకే చట్టప్రకారం రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. వారికే పేస్కేల్ అందజేస్తామన్నారు. అయితే రాష్ట్ర సర్కార్ దగ్గర నిధుల కొరతతో హక్కుదారులుగా ఉన్న వీఆర్ఏలకు ఇప్పటికీ పేస్కేల్ విధానం అమలు కావడం లేదు. దీంతో వారంతా రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రామాలు చేపట్టారు. అయితే సర్కార్ వీరి పోరు నుంచి తప్పించుకునేందుకు గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీని విస్మరించి వాటాదారులను రెచ్చకొట్టి హక్కుదారులకు పోటీగా కౌంటర్ ప్రోగ్రామ్స్ చేయిస్తోంది. ఫలితంగా వీఆర్ఏలకు సంబంధించిన రెండు వర్గాలు ఇప్పుడు వైరి పక్షాలుగా మారిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.






