ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే ఎమ్మెల్సీ లను ప్రకటించారు BRS అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. దేశపతి శ్రీనివాస్ , కుర్మయ్య గారి నవీన్ కుమార్ , చల్లా వెంకట్రామిరెడ్డి అభ్యర్ధిత్వాలను ఖరారు చేసారు కేసీఆర్. ఈ ముగ్గురి నామినేషన్ లతో పాటుగా గెలుపుకోసం పనిచేయాల్సిందిగా శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లను ఆదేశించారు.
ఎమ్మెల్యే కోటాలో ఈ ముగ్గురు ఎమ్మెల్సీ ల ఎన్నిక లాంఛనమే ! ఎందుకంటే శాసనసభలో 100 మందికి పైగా ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది అధికార పార్టీకి. దాంతో ఈనెల 9 న నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక గవర్నర్ కోటాలో మరో ఇద్దరికి అవకాశం కలగనుంది. ఆ ఇద్దరు ఎమ్మెల్సీ లు ఎవరనేది ఈనెల 9 న కేబినెట్ సమావేశం తర్వాత నిర్ణయించనున్నారు కేసీఆర్.
దేశపతి శ్రీనివాస్ గత 20 ఏళ్లుగా కేసీఆర్ వెన్నంటే నడుస్తున్నారు. ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించాడు. ఇక కుర్మయ్య గారి నవీన్ కుమార్ కూడా పార్టీలో చాలాకాలంగా కొనసాగుతున్నాడు. ఇక చల్లా వెంకట్రామిరెడ్డి మాత్రం ఇటీవలే BRS పార్టీలో చేరాడు. ఆయనకు అలాగే చల్లా కుటుంబానికి మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా కర్నూల్ జిల్లాలో మంచి పట్టుంది. దాంతో ఉభయకుశలోపరిగా చల్లాకు ఛాన్స్ ఇచ్చాడు కేసీఆర్.