
భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షాక్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. తాజాగా ఏఐసీసీ కొత్త కమిటీని నియమించింది. పీసీసీ కొత్త కమిటీలో పలువురికి చోటు దక్కింది కానీ వేసిన ఏ కమిటీలో కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఛాన్స్ దక్కకపోవడం షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నాడు.
అయితే ఇప్పుడు ఆ పదవి కూడా దక్కలేదు. అలాగే పలు కమిటీలను కూడా ఏఐసీసీ ప్రకటించింది కానీ దేనిలో కూడా కోమటిరెడ్డి కి ప్రాధాన్యం లేకుండాపోయింది. ఇందుకు కారణం ఇటీవల మునుగోడు లో జరిగిన ఉప ఎన్నికలే ! మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రచారం చేయకపోగా , తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలంటూ కాంగ్రెస్ నాయకులను , కార్యకర్తలను కోరినట్లుగా ప్రచారం జరిగి పెద్ద వివాదాన్నే సృష్టించింది. దాంతో కోమటిరెడ్డిని పక్కన పెట్టినట్లే అని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.