తెలంగాణలో మళ్ళీ TRS పార్టీ పెట్టడం ఏంటి ? TRS ను కాస్త BRS గా మార్చాడు కదా ! కేసీఆర్ అని అనుకుంటున్నారా ? ఇక్కడే ఉంది అసలు కిటుకు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చడంతో తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ను ఎదుర్కోవడానికి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి TRS అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడట.
కేసీఆర్ TRS అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెట్టే పార్టీ ” తెలంగాణ రైతు సమితి ” అంటే ఇది కూడా TRS అనే చెప్పాలి. తెలంగాణ సెంటిమెంట్ తో , రైతుల మద్దతుతో ఇలా ప్లాన్ చేస్తున్నాడట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అయితే ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ప్రస్తతం చర్చల దశలోనే ఉంది. త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నాడట పొంగులేటి.
2014 లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి వైసీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించాడు పొంగులేటి. అయితే తెలంగాణలో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ కి రాజీనామా చేసి అధికార TRS లో చేరాడు. అయితే 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పొంగులేటికి ఛాన్స్ ఇవ్వలేదు కేసీఆర్. నామా నాగేశ్వర్ రావు ను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయించి TRS లోకి తీసుకొని మరీ టికెట్ ఇచ్చాడు. ఆ ఎన్నికల్లో నామా నాగేశ్వర్ రావు గెలిచాడు. అప్పటి నుండి పొంగులేటికి పార్టీలో అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. దాంతో కొత్త TRS పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.