
హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున భారీ పేలుడు సంభవించింది. దాంతో ఒక్కసారిగా నగరంలో కలకలం చెలరేగింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోయర్ ట్యాంక్ బండ్ లోని స్నో వరల్డ్ దగ్గర ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ లో పేలుడు సంభవించింది. పేలుడు సంభవించిన సమయంలో కర్నూల్ కు చెందిన తండ్రీ కొడుకులు చంద్రన్న , సురేష్ అక్కడే ఉన్నారు. దాంతో పేలుడు ధాటికి ఇద్దరికీ గాయాలయ్యాయి.
గాయాలపాలైన చంద్రన్న , సురేష్ లను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చెత్త డంపింగ్ యార్డ్ లో భారీ పేలుడు సంభవించడంతో రంగంలోకి దిగారు పోలీసులు. పేలుడుకు గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.