
ఈనెల 25 న హైదరాబాద్ లో భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న టి 20 మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. అయితే HCA ( హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటన లో వందలాది మంది యువకులు గాయపడ్డారు. అలాగే ఓ మహిళ పరిస్థితి విషమంగా తయారయ్యింది. అయితే ప్రాథమిక చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం కుదుట పడటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఇక ఈ సంఘటనలో పోలీసులు కూడా గాయపడ్డారు. వేలాదిగా జనాలు వస్తే …… కేవలం నాలుగు లైన్లు మాత్రమే ఏర్పాటు చేయడంతో జింఖానా గ్రౌండ్ బయట పెద్ద ఎత్తున ఉండిపోయారు జనాలు. దాంతో టికెట్లు తమకు దక్కవేమో అనే ఆందోళనతో ముందుకు కదిలారు. ఒక్కసారిగా వేలాది మంది తోసుకుంటూ రావడంతో వాళ్ళను అదుపు చేయలేక పోలీసులు లాఠీలకు పని కల్పించారు. దాంతో పోలీసులపై కొందరు తిరగబడ్డారు. ఇంకేముంది ఇరు వర్గాలు తోసుకోవడంతో వందలాదిగా గాయపడ్డారు. HCA నిర్లక్ష్యం వహించడం వల్లే ఇంతటి ఘోరం జరిగిందని తప్పకుండా HCA పై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు తెలంగాణ డీజీపీ.