
భారత రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెడుతున్నారు. ఇన్నాళ్లు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన తెలంగాణ రాష్ట్ర సమితి(TRS ) పార్టీని ఈరోజు నుండి భారతీయ రాష్ట్ర సమితి (BRS ) గా మారుస్తున్నారు. దేశ రాజకీయాలను మారుస్తాను …… సంపద సృష్టిస్తాను …… ప్రజలకు పంచుతాను అనే నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు కేసీఆర్.
ఈరోజు విజయదశమి కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని BRS పార్టీని ప్రకటించనున్నారు కేసీఆర్. ఇప్పటికే వివిధ రాష్ట్రాలనుండి కేసీఆర్ కు మద్దతుగా పలువురు నాయకులు హైదరాబాద్ చేరుకున్నారు. ఆ నాయకులు ఆయా రాష్ట్రాలలో BRS ప్రతినిధులుగా కొనసాగనున్నారు. నరేంద్ర మోడీని ఓడించాలంటే ఇప్పుడున్న శక్తులతో కుదరదని , కాంగ్రెస్ పార్టీతో అస్సలు కుదరదని భావించారు కేసీఆర్.
అందుకే తానే జాతీయ రాజకీయాల్లోకి రావాలని భావించి దేశ వ్యాప్తంగా రైతు ఉద్యమంలో పాల్గొన్న రైతులను కూడా ఆహ్వానించారు. తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చాను , అనితర సాధ్యం అనుకున్న తెలంగాణ సాధించాను …… ఇక మార్చాల్సింది దేశాన్ని , దేశ రాజకీయాలను అంటూ జాతీయ నాయకుడిగా ఎదగడానికి శంఖారావం పూరిస్తున్నారు కేసీఆర్. ఈరోజు మధ్యాహ్నం 1:19 నిమిషాలకు జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు కేసీఆర్.