
నాటు నాటు అనే పాటతో యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ సాధించిన విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డు సాధించడం అంటే మాటలు కాదు అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆర్ ఆర్ ఆర్ టీమ్ ను ఘనంగా సన్మానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమెరికాలో ఉంది ఆర్ ఆర్ ఆర్ టీమ్. భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత ఒక మంచి డేట్ నిర్ణయించి ఘనంగా సన్మానించాలని నిర్ణయించింది.
దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి , హీరోలు జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ , సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి , రచయిత చంద్రబోస్ , పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ , కాలభైరవ లతో పాటుగా కెమెరామెన్ సెంథిల్ , డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్, నిర్మాత డివివి దానయ్య తదితరులను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది.
ఈ వేడుకను తెలుగు సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి , నందమూరి బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ తదితరుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించనుంది కేసీఆర్ సర్కారు. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.