మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఉభయ కమ్యూనిస్టుల మద్దతు తీసుకున్న కేసీఆర్ ఆ పార్టీలకు తాజాగా గట్టి షాక్ ఇవ్వడానికి రెడీ అయినట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార BRS కేవలం 10 వేల ఓట్లతో గెలిచింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతు లేకపోతే తప్పకుండా BRS ఓడిపోయేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
కట్ చేస్తే …… ఈ ఏడాది ఆఖరులో అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం , సీపీఐ రెండు పార్టీలు కూడా కొన్ని స్థానాలను ఆశిస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం , నల్గొండ జిల్లాలో ఉభయ కమ్యూనిస్టులకు బలం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా 30 స్థానాల్లో బలమైన క్యాడర్ , ఓట్లు ఉన్న పార్టీలు కావడంతో కనీసం 10 స్థానాల్లోనైనా పోటీ చేస్తామని అంటున్నారు.
అయితే కేసీఆర్ మాత్రం వేరే లెవల్లో ఆలోచిస్తున్నాడు. ఉభయ కమ్యూనిస్టులకు ఒక్క సీటు కూడా ఇచ్చే ఆలోచనలో లేడట. అసెంబ్లీ ఎన్నికలు అంటే మందీ మార్బలం , పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టాలి ఇలాంటి బోలెడు తతంగమంతా ఉంటుంది కాబట్టి ఉభయ కమ్యూనిస్టులు పోటీ చేయకుండా BRS కు మద్దతు ఇస్తే …… 119 నియోజక వర్గాలలో మేమే పోటీ చేస్తామని , ఎన్నికల్లో గెలిచిన తర్వాత MLC గా కొంతమందికి అలాగే మరికొంతమందిని రాజ్యసభకు పంపిస్తామని ….. అలా ఉభయ కమ్యూనిస్టులను గౌరవించుకుంటామని అంటున్నాడట. అయితే దీనికి సిపిఎం, సీపీఐ నాయకులు మాత్రం అంగీకరించడం లేదు.
ఒకవేళ తన ప్రతిపాదనకు ఉభయ కమ్యూనిస్టులు ఒప్పుకోకపోతే రాజీమార్గంగా ఫ్రెండ్లీ పోటీకి సిద్ధం అవుదామని , అంటే మేము పోటీ చేస్తాం …… మీరు పోటీ చేయండి….. కాకపోతే ఒకటి రెండు స్థానాల్లో చూసి చూడనట్లుగా ప్రచారం చేసుకుందాం ….. ఉభయులం లాభపడదాం అని అంటున్నాడట. మొత్తానికి కేసీఆర్ ప్రతిపాదనలు ఉభయ కమ్యూనిస్టు లకు కాస్త కోపం తెప్పించే అంశాలు అనే చెప్పాలి. మునుగోడు లో మద్దతు ఇచ్చి గెలిపించినందుకు భలేగా రుణం తీర్చుకుంటున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున అప్పటి వరకు చర్చల్లో పురోగతి ఉండొచ్చు అని ఆశాభావంతో ఉన్నారు ఉభయ కమ్యూనిస్టులు.