తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి రెచ్చగొట్టి అసెంబ్లీని రద్దు చేసే యోచనలో ఉన్నారట BRS అధినేత కేసీఆర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ విచారణకు పిలిచిన నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవితను ఈరోజు విచారించాల్సి ఉంది అయితే షెడ్యూల్ ప్రకారం కొన్ని కార్యక్రమాలు ఉన్నందున ఈనెల 15 తర్వాత విచారణకు వస్తానని లేఖ రాసింది. అయితే ఈనెల 15 కు బదులుగా 11 న ఈడీ విచారణకు వెళ్తున్నట్లుగా ప్రకటించింది కవిత.
ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. అంతకంటే ముందే కవిత ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు మీడియా సమావేశం నిర్వహిస్తోంది. ఇక రేపు BRS సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు కేసీఆర్. ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నాయకులను అందరినీ హాజరు కావాలని ఆదేశించారు కేసీఆర్. ఈ సమావేశంలో కవిత అరెస్ట్ విషయం గురించి మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ అంతటా సెంటిమెంట్ ను రెచ్చగొట్టేలా ధర్నాలు , రాస్తారోకోలు చేయాలని , తద్వారా వచ్చే స్పందన ను బట్టి అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నారట కేసీఆర్. అయితే కవిత అరెస్ట్ వ్యవహారం అలాగే అరెస్ట్ అయ్యాక ప్రజల నుండి వచ్చే స్పందన ను బట్టి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారట. సాధారణంగా ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం ఉంది. కానీ తెలంగాణ లో మాత్రం ముందస్తుకు వెళ్ళడానికి కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.