
అధికార టీఆర్ఎస్ పార్టీకి , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. ఉద్యమ కాలంలో కేసీఆర్ వెంట నడిచిన బూర నర్సయ్య గౌడ్ 2014 లో భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి టీఆర్ ఎస్ అభ్యర్థి గా పోటీ చేసి విజయం సాధించాడు. అయితే 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయాడు. దాంతో అప్పటి నుండి టీఆర్ఎస్ అగ్ర నాయకులు బూర నర్సయ్య గౌడ్ కు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
ఇక ఇటీవల మునుగోడు అసెంబ్లీ స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో టీఆర్ఎస్ తరుపున పోటీ చేయాలని భావించాడు. అయితే జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి మాత్రం బూర నర్సయ్య గౌడ్ ని పూర్తిగా పక్కన పెట్టి ఘోరంగా అవమానించాడు. దాంతో తీవ్ర అసంతృప్తికి లోనైన బూర నర్సయ్య గౌడ్ మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు ల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొద్దిరోజులు సహకరించు …… ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయని చెప్పారట.
దాంతో ఇక పార్టీలో ఉండి లాభం లేదని నిర్ణయించుకున్న బూర నర్సయ్య గౌడ్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళాడు. అక్కడ బీజేపీ జాతీయ నేతలను కలిసి కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే మునుగోడు లో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం జరగడం ఖాయం. ఎందుకంటే మునుగోడు లో 1,20,000 కు పైగా పద్మశాలి , గౌడ్ , ముదిరాజ్ ఓట్లు ఉన్నాయి. బూర నర్సయ్య …… గౌడ్ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత కావడం విశేషం.