ఈనెల 17 న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ కొత్త సచివాలయాన్ని ప్రారంభించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అలాగే అదే రోజున రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలను , BRS కార్యకర్తలను తరలించి పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. దాంతో ఆ ఏర్పాట్లపై పార్టీ శ్రేణులకు , నాయకులకు దిశానిర్దేశం చేసాడు ఐటీ , మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్.
ఉభయ జిల్లాలకు చెందిన మంత్రులతో అలాగే శాసన సభ్యులతో , ఎమ్మెల్సీ లతో పాటుగా కీలక నాయకులతో సమావేశం నిర్వహించాడు కేటీఆర్. ప్రతీ నియోజకవర్గం నుండి 15 వేలకు తక్కువ కాకుండా జనాలను తరలించాలని , అందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చర్చించారు. తెలంగాణలో కొత్తగా సచివాలయాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఇంకా పూర్తి కాలేదు. 6 వ ఫ్లోర్ ని మాత్రం అత్యంత ఆధునికంగా నిర్మించారు. ఆ ఫ్లోర్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తయ్యాక పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.