
వంట గ్యాస్ ధరలు రోజు రోజుకు పెంచుతూ ప్రజల మీద భారం మోపుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ , యువ నాయకుడు కేటీఆర్ మోడీ ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతుంటే …… మరోవైపు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే గొంగిడి సునీత మాత్రం వంట గ్యాస్ ధరలు పెంచాల్సిందే అంటూ మహిళామణులను వెంటేసుకొని నడిరోడ్డుపై ధర్నా చేయడం సంచలనం సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతుంటే అదే పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే గ్యాస్ ధరలు పెంచాల్సిందే మోడీ అంటూ వార్నింగ్ ఇవ్వడమే కాక ధరలు పెంచకపోతే….. అవసరమైతే ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తామని హెచ్చరించిన గొంగిడి సునీత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలు విషయం ఏమిటంటే…… సదరు మహిళా ఎమ్మెల్యే గ్యాస్ ధరలు తగ్గించాలనే ధర్నాకు దిగింది. అయితే అత్యుత్సాహం ప్రదర్శించి మోడీని తీవ్ర స్థాయిలో విమర్శించాలనే తొందరపాటులో ధరలు తగ్గించాల్సిందే అని చెప్పబోయి వంట గ్యాస్ ధరలు పెంచాల్సిందే అంటూ పదేపదే చెప్పింది. అయితే ఎమ్మెల్యే ఏం మాట్లాడుతుందో అర్థం కాక కొంతమంది అలాగే వింటూ ఉండిపోయారు. కట్ చేస్తే ఎమ్మెల్యే పదేపదే గ్యాస్ ధరలు పెంచాలని అంటూ ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అంతే పెంచడం కాదు తగ్గించాలని మనం ధర్నా చేస్తున్నామని చెప్పడంతో పాపం నాలిక కరుచుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వంట గ్యాస్ ధరలు పెంచాల్సిందే అనే మాటలు వైరల్ గా మారాయి పాపం.