సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న అనారోగ్యంతో ఈరోజు మరణించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి వరుసగా అయిదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు సాయన్న. తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సాయన్న మూడుసార్లు తెలుగుదేశం పార్టీ నుండే గెలిచాడు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. రెండుసార్లు కూడా టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు.
కిడ్నీ వ్యాధితో , హై బీపీతో బాధపడుతున్న సాయన్న ఈనెల 16 న యశోద ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో ఈరోజు మరణించారు. సాయన్న మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సాయన్న చేసిన సేవలను కొనియాడారు. సాయన్న వివాదరహితుడు కావడంతో కాంగ్రెస్ పార్టీ , భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా సాయన్న మృతికి తీవ్ర విచారం వెలిబుచ్చారు.