
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కథ ఎప్పుడో ముగిసిన అధ్యాయమని , ఇంకా భ్రమలు పెట్టుకొని తెలంగాణలో తిరగడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది ఎమ్మెల్సీ కవిత. ఆకాశంలో ఎన్ని స్టార్స్ ఉన్నా చంద్రుడు ఒక్కడే అన్నట్లుగా తెలంగాణలో ఎన్ని పార్టీలు ఉన్నా కేసీఆర్ ను మాత్రమే తమ నాయకుడిగా గుర్తిస్తారని అంటోంది కవిత. నిన్న ఖమ్మం లో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు పర్యటనకు ప్రజల నుండి అనూహ్య స్పందన రావడంతో టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. దాంతో తెలంగాణలో మళ్లీ టీడీపీని బలోపేతం చేసే పనిలో పడ్డాడు బాబు.
ఇక ఇదే సమయంలో చంద్రబాబు తో పాటుగా కేంద్ర ప్రభుత్వం పై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది కవిత. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని, రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం కల్లాలని నిర్మిస్తే కేంద్రం వద్దని అంటోందని, పైగా 150 కోట్లు ఇందు కోసం వెచ్చిస్తే ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని కేంద్రం కోరడం అర్థం లేనిదని ఆగ్రహించింది కవిత. కేంద్రం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ రేపు తెలంగాణ అంతటా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నామని ప్రకటించింది. భారత్ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు, నాయకులు , మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేపటి ధర్నాలో పాల్గొంటారని మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాల పట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు.