2024 లో లోక్ సభకు ఎన్నికలు రానున్న నేపథ్యంలో దానికి ముందే సెమీ ఫైనల్ ఎన్నికలు ఈ ఏడాదిలోనే ఉన్నాయి. 2023 లో ఏకంగా 9 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అందులో కర్ణాటక , తెలంగాణ కీలకం కానున్నాయి. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధికారంలో కొనసాగుతోంది. అయితే మరో నాలుగు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విజయకాశాలు తక్కువగా ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే తెలంగాణలో మాత్రం భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ నేతృత్వంలో శరవేగంగా దూసుకుపోతోంది. బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక బీజేపీ ఊహించని విధంగా లాభపడింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో సంచలనం సృష్టించింది బీజేపీ. అలాగే దుబ్బాక , హుజురాబాద్ ఎన్నికలలో విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఇక మునుగోడు లో పార్టీ గెలవకపోయినా భారీగా ఓట్లను సాధించింది. దాంతో రాబోయే ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ గెలుస్తుందనే ధీమా వ్యక్తం అవుతోంది.
దాంతో బండి సంజయ్ కు కేంద్ర మంత్రిగా ప్రమోషన్ ఇస్తే …… కేసీఆర్ సర్కారుపై మరింతగా విరుచుకు పడతాడని భావిస్తున్నారట ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా. ఈ ఇద్దరూ డిసైడ్ అయితే ఇంకేముంది. తెలంగాణలో మొత్తం నలుగురు పార్లమెంట్ సభ్యులు గెలిచారు అలాగే ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు. కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే బండి సంజయ్ లేదా ధర్మపురి అరవింద్ లలో ఒకరికి కేంద్రమంత్రిగా ఛాన్స్ ఇస్తే తప్పకుండా పార్టీకి ఎంతగానో ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారట. సంక్రాంతి తర్వాత కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని , బండి సంజయ్ లేదంటే ధర్మపురి అరవింద్ లలో ఒకరు కేంద్ర మంత్రి అవ్వడం ఖాయమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.