రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ఘననివాళి అర్పించింది పార్లమెంట్. ఈరోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో ఇటీవల కాలంలో చనిపోయిన లోక్ సభ , రాజ్యసభ సభ్యులకు నివాళి అర్పించారు. ఆ కోవలోనే మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు కు భారత పార్లమెంట్ ఘననివాళులు అర్పించింది. 1998 లో భారతీయ జనతా పార్టీ తరుపున కాకినాడ నుండి పోటీ చేసి విజయం సాధించి లోక్ సభలో అడుగుపెట్టారు కృష్ణంరాజు.
అయితే ఆ తర్వాత 13 నెలల కాలంలోనే అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం పడిపోవడంతో 1999 లో మళ్ళీ లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. కాగా ఆ సమయంలో కాకినాడ నుండి కాకుండా నర్సాపురం లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి ఘనవిజయం సాధించాడు. అటల్ బిహారీ వాజ్ పేయి మంత్రివర్గంలో దాదాపు మూడేళ్ళ పాటు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసాడు. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా , రక్షణ శాఖా సహాయ మంత్రిగా , గ్రామీణాభివృద్ధి శాఖా సహాయ మంత్రిగా కీలక శాఖలను నిర్వహించాడు కృష్ణంరాజు.
అయితే 2004 లో మాత్రం ఓటమి పాలయ్యాడు. అలాగే 2009 లో ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసి కూడా ఓటమి చెందాడు. ఇక అప్పటి నుండి మళ్ళీ రాజకీయాల వైపు చూడలేదు. అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణంరాజుకు గవర్నర్ పదవి దక్కడం ఖాయమని అనుకున్నారు. ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. దాంతో కృష్ణంరాజు లోక్ సభ సభ్యుడిగా , కేంద్ర మంత్రిగా అందించిన సేవలను శ్లాఘించింది పార్లమెంట్.