కామారెడ్డి జిల్లాలో బండరాళ్ల మధ్య చిక్కుకున్న రాజు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డాడు. దాంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 43 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత రాజు సురక్షితంగా బయటపడ్డాడు. కామారెడ్డి జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో జంతువుల వేటకు వెళ్ళాడు రాజు. తన మిత్రులతో కలిసి జంతువులను వేటాడేందుకు వెళ్లిన సమయంలో రెండు పెద్ద బండరాళ్ల మధ్య తొంగి చూస్తున్న సమయంలో సెల్ ఫోన్ ఆ బండరాళ్లలో పడింది.
దాంతో సెల్ ఫోన్ తీసుకునేందుకు రివర్స్ లో తల కిందకు కాళ్ళు పైకి పెట్టి వెతుకుతున్న సమయంలో బండరాళ్ల మధ్యలో చిక్కుకున్నాడు. లోపల చిక్కుకు పోవడంతో భయపడిన రాజు మిత్రులు అతడ్ని బయటకు తీసుకు రావడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో చేసేది లేక పోలీసులకు అలాగే ఫారెస్ట్ , రెవిన్యూ డిపార్ట్మెంట్ లకు సమాచారం అందించారు.
విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మొత్తానికి 43 గంటల తర్వాత బండరాళ్లను కొద్దికొద్దిగా పగులగొట్టి రాజును బయటకు తీశారు. బండరాళ్లలో లోపలకి జారిన సమయంలో చేయికి గాయమైంది తప్ప మరే గాయాలు కాకపోవడంతో రాజుకు ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రస్తుతం కామారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిని అభినందించారు జిల్లా ఎస్పీ.