Revanth reddy టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చాక ఆ పార్టీ బలం మరింత పెరిగింది. అధికార బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టడానికి ఆయన నిరంతరం తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎక్కడికక్కడ కొత్త ఎత్తుగడలు వేస్తూ అధికార బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొడుతున్నారు ప్రస్తుతం కరెంటు ఇష్యూలో రేవంత్ రెడ్డిని ఇంతగా టార్గెట్ చేశారంటేనే బీఆర్ఎస్ ఎంత వణికిపోతున్నదో అర్థమవుతున్నదని ఆయన అభిమానులు చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ ఎంత టార్గెట్ చేసినా ఆయన ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. పార్టీలో కీలక నేతల చేరికలపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టి, దెబ్బ మీద దెబ్బ బీఆర్ఎస్ ను కొడుతూనే ఉన్నారు. దీంతో పాటు బీఆర్ఎస్ కు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ పెరిగింది. ఇప్పటికే పొంగులేటి పార్టీలో చేరగా, త్వరలోనే జూపల్లి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే తాజాగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా హస్తం గూటికి చేరుతున్నారు. ఆయన కోడలు ప్రస్తుతం జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్నారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉండడంతో ఇక వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం టికెట్ తనకు దక్కదని ఆలోచనతోనే కాంగ్రెస్ గూటికి తీగల కృష్ణారెడ్డి వస్తున్నట్లు సమాచారం. ఆయనతోపాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత, గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు భార్య భువనేశ్వరి, ఆరంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి, తదితరులు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు బుధవారం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వివరాల కమిటీ సభ్యులు, ముఖ్య నేతలు సమావేశం అవుతున్నారు. చేరికల వ్యూహాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశం తర్వాత రాష్ర్ట ఇన్చార్జి ఠాక్రే, రేవంత్ ఢిల్లీకి వెళ్తారని తెలుస్తున్నది.
అయితే పార్టీలో ఉంటూ పార్టీకి, పీసీసీ చీఫ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై కూడా చర్యలకు రేవంత్ రెడ్డి ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై కూడా హై కమాండ్ తో చర్చించనున్నట్లు తెలుస్తున్నది. పార్టీకి నష్టం చేసే వారి విషయంలో వెనక్కి తగ్గబోమని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఇదే తెల్చి చెప్పారు. ఏదేమైనా రేవంత్ రెడ్డి మాత్రం ఏదో చేసేలానే కనిపిస్తున్నారు. కాంగ్రెస్ లో ప్రస్తుతం ఉన్న జోష్ ఇలాగే కొనసాగి, సీనియర్లంతా ఏకతాటి పైకి వస్తే మాత్రం ఇక తిరుగుండదు. అధికార బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవు. మరి ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లుగానే కనిపిస్తున్నది.