
సెప్టెంబర్ 17 ……. తెలంగాణకు విముక్తి లభించిన రోజు. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన రోజు. అదేంటి భారతదేశానికి 1947 ఆగస్టు 15 న స్వాతంత్య్రం వచ్చింది కదా ! ఇదే కదా డౌట్ . భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన రోజు అనగానే టక్కున ఆగస్టు 15 అని చెబుతారు. కానీ తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17 న స్వాతంత్య్రం లభించింది. ఇలా ఎందుకు జరిగిందో తెలుసా …….
నైజాం ప్రాంతం అంటే తెలంగాణతో పాటుగా కర్ణాటక లోని కొన్ని జిల్లాలు అలాగే మహారాష్ట్ర లోని కొన్ని జిల్లాలు కలిపి హైదరాబాద్ ను రాజధానిగా చేసుకొని నైజాం నవాబు పరిపాలించాడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ భారత్ లో మేము విలీనం కాము , స్వతంత్య్ర దేశంగా ఉంటాం లేదంటే పాకిస్థాన్ లో కలుస్తామని స్పష్టం చేసారు అప్పటి నైజాం నవాబ్.
అంతేకాకుండా నైజాం పాలనలో రజాకార్ల అరాచకాలు చెప్పనలవి కావు. మహిళలపై అత్యాచారాలు చేయడం , మనుషులను దారుణంగా చంపడం చేస్తూండేవాళ్లు. దాంతో నైజాం పాలనకు అంతం పలకడానికి అలాగే ఖాసీం రజ్వీ సాగిస్తున్న మారణకాండకు ముగింపు పలకాలని భావించారు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్.
దాంతో సైనిక చర్యకు పూనుకున్నారు. హైదరాబాద్ ని నలువైపులా చుట్టుముట్టి రజాకార్లతో భీకర పోరాటం చేసారు భారత సైనికులు. ఈ సైనిక చర్యలో భారత సైన్యం 66 మంది చనిపోయారు. 97 మంది గాయపడ్డారు. ఇక 490 మంది రజాకార్లు చనిపోగా 122 మంది గాయపడ్డారు. తెలంగాణలో దారుణ మారణకాండ సాగించిన ఖాసీం రజ్వీని అరెస్ట్ చేసి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. జైలు నుండి విడుదల అయ్యాక పాకిస్థాన్ వెళ్లి అక్కడే చనిపోయాడు ఖాసీం రజ్వీ. ఇక సైనిక చర్యతో నైజాం నవాబు తలవంచాడు. అదే సెప్టెంబర్ 17 . దాంతో ఈరోజుని విమోచన దినోత్సవం అని కేంద్ర ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవం అంటూ ఉత్సవాలు పోటీగా నిర్వహిస్తోంది.