
తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం చెలరేగింది. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లంతా జట్టు కట్టిన విషయం తెలిసిందే. భట్టి విక్రమార్క , ఉత్తమ్ కుమార్ రెడ్డి , జగ్గారెడ్డి , మహేశ్వర్ రెడ్డి , గీతారెడ్డి వంటి వారంతా ఈరోజు కూడా భట్టి విక్రమార్క ఇంట్లో మరోసారి సమావేశం కానున్నారని తెలుసుకొని కాంగ్రెస్ అధిష్టానం దిగ్విజయ్ సింగ్ కు బాద్యతలు అప్పగించడంతో వెంటనే రంగంలోకి దిగాడు డిగ్గీ రాజా.
హుటాహుటిన పలువురు నాయకులకు ఫోన్లు చేసి ఈరోజు సాయంత్రం జరిపే సమావేశాన్ని రద్దు చేయించాడు. అంతేకాదు రెండు రోజుల్లో నేను హైదరాబాద్ వస్తున్నానని , అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇవ్వడంతో సీనియర్లు చల్లబడ్డారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదేళ్ల పాటు అధికారం చెలాయించిన దిగ్విజయ్ సింగ్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ గా కూడా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ కు వస్తుండటంతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తాయనే అంటున్నాడు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. డిగ్గీ రాజా హైదరాబాద్ వచ్చాక పరిస్థితులు చక్కబడతాయా ? లేక షరామామూలేనా ? అన్నది చూడాలి.