
హైదరాబాద్ మహానగరంలోని ”పైగా ప్యాలెస్ ” కు వీడ్కోలు పలికింది అమెరికా కాన్సులేట్. 14 సంవత్సరాలుగా సేవలు అందించిన పైగా ప్యాలెస్ ఈరోజుతో మూతబడనుంది. ఈనెల 23 నుండి నానక్ రాంగూడ లోని అమెరికా కాన్సులేట్ కొత్త కార్యాలయం అక్కడి నుండే సేవలు అందించనుంది. ఈరోజు పైగా ప్యాలెస్ ప్రాంగణం అంతా ఖాళీ చేయనుంది అమెరికా కాన్సులేట్.
తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , ఒడిశా రాష్ట్రాలకు చెందిన వాళ్లకు వీసా సేవలు అందించే ఈ అమెరికా కాన్సులేట్ కార్యాలయం ఇక నుండి నానక్ రాంగూడ నుండే సేవలు అందించనుంది. 2006 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ హైదరాబాద్ లో పర్యటించారు. ఆ సమయంలో అమెరికా కాన్సులేట్ కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.
అమెరికా అధికారులు పలు భవనాలను పరిశీలించిన మీదట బేగంపేట లోని పైగా ప్యాలెస్ ను ఎంపిక చేసారు. నైజాం నవాబ్ దగ్గర ప్రధానమంత్రిగా పని చేసే నవాబ్ వికారుల్ ఉమ్రా ఈ ప్యాలెస్ ను రెండున్నర ఎకరాలలో యూరోపియన్ శైలిలో నిర్మించాడు. కాలక్రమంలో నైజాం నవాబ్ ఆస్తులలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. అలా వచ్చిన ఈ పైగా ప్యాలెస్ లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ కార్యాలయం ఉండేది.
నానక్ రాంగూడలోని 12. 3 ఎకరాల విస్తీర్ణంలో కొత్త భవంతి సిద్దమయింది. దాంతో ఈరోజుతో పైగా ప్యాలెస్ లో సేవలు నిలిచిపోనున్నాయి. ఈనెల 23 నుండి కొత్త కార్యాలయం నుండి వీసా సేవలు అందించనుంది అమెరికా కాన్సులేట్ ఇక్కడ ప్రతీ రోజు 2500 మందిని ఇంటర్వ్యూ చేయడానికి 54 వీసా ఇంటర్వ్యూ కేంద్రాలను ఏర్పాటు చేసారు.