Ts Governor : పోలీసులపై ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువగా వస్తూనే ఉన్నాయి. అసలు పని ఒదిలేసి, కొసరు పని చేస్తున్నారంటూ నెటిజన్లు ఆడుకుంటూ ఉంటారు. వీఐపీల మీద ఉన్న శ్రద్ధ సామాన్య ప్రజానీకం మీద లేదంటూ వారు పోస్టులు పెడుతూ పోలీస్ శాఖ తీరును ఎండగడుతూ ఉంటారు. నిజానికి కొంత కాలంగా ఇదే జరుగుతున్నది. చలాన్ల వసూలు, వెహికిల్స్ ను ఫొటోలు తీయడం పై ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం లో ఉండడం లేదు. ఇది ఒక్క హైదరాబాద్ కే పరిమితం కాలేదు. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. అయితే తాజాగా ఏకంగా రాష్ర్ట గవర్నర్ కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొన్నారు.
సోమవారం రాత్రి గవర్నర్ తమిళిసై ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. గవర్నర్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. ఖైరతాబాద్ లోని హనుమాన్ టెంపుల్ కు వచ్చిన గవర్నర్ రాజ్ భవన్ కు వెళ్తుండగా ఇలా ట్రాఫిక్ లో ఆగిపోయారు. ఖైరతాబాద్, ఎర్రమంజిల్ మార్గంలో పెద్ద ఎత్తు న ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో గవర్నర్ భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి, ట్రాఫిక్ ను కంట్రోల్ చేయాల్సి వచ్చింది. వారే స్వయంగా ట్రాఫిక్ ను పంపించేసి, గవర్నర్ కాన్వాయ్ ను ముందుకు తీసుకెళ్లారు. గవర్నర్ పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజానీకం పరిస్థితి ఇక దేవుడెరుగు.
అయితే ట్రాఫిక్ సిబ్బందికి కొన్ని రోజులుగా రోజుకు 50 కేసులంటూ ఉన్నతాధికారులు టార్గెట్ పెట్టినట్లుగా బయట టాక్ నడుస్తున్నది. దీంతో ట్రాఫిక్ పోలీసులు కేవలం కెమెరాలు పట్టుకొని వాహనాల ఫొటోలు తీసేపనిలో నిమగ్నమయ్యారు. ఇక ట్రాఫిక్ కంట్రోల్ గాలికొదిలేశారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే తెలంగాణ పోలీసులకు ఉన్న గుడ్ కాప్స్ ట్యాగ్ కాస్తా బాడ్ కాప్స్ మారిపోగలదు. పోలీస్ ఉన్నతాధికారులే దీనిపై కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే సామాన్య పౌరుల నుంచి చీవాట్లు తప్పవు.