AP ఏపీ సీఎం జగన్ ఏర్పాటు చేసిన వలంటీర్ల వ్యవస్థ ప్రారంభం నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. ప్రజలకు అన్ని రకాల సేవలు అందించేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా అసలు పని మాత్రం వైసీపీని ప్రమోట్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదనే ఆరోపణలు ఉన్నాయి. వలంటీర్ల ముసుగులో కొందరు అక్రమాలు, అవినీతికి పాల్పడిన ఘటనలు వెలుగు చూశాయి. కానీ ఏపీ సీఎం ఈ వ్యవస్థను పారదర్శకంగా, జవాబుదారీగా పని చేయించడం లేదనే విమర్శ ఉన్నది.
జగన్ సర్కార్ వచ్చిన తొలినాళ్లలోనే ఈ వ్యవస్థను ప్రారంభించారు. వీరి ద్వారానే ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వహణ సాగుతున్నది. గ్రామాల్లో ఏ పని కావాలన్నా వలంటీర్లే కీలకంగా మారారు. వలంటీర్ల అతి జోక్యంతో వైసీపీ క్యాడర్ సైతం మండిపడుతున్నది. ప్రతి ఇంటి వివరాలు.. వలంటీర్ల నుంచి ఆన్ లైన్ లో అప్ లోడ్ అవుతున్నాయి. ఈ డేటా అంతా సంఘ విద్రోహశక్తులకు చేరితే? జరగబోయే పరిణామాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వలంటీర్ల వ్యవస్థపై గతంలో ఏపీ హైకోర్టు సైతం సంచలన వ్యాఖ్యలు చేసింది. వీరి నియామకాలు చట్టపరంగా జరగలేదని స్పష్టం చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థలో వలంటీర్లను భాగస్వాములను చేయడంపై ప్రశ్నించింది. ప్రజల వివరాలను ఆన్లైన్లో అప్ లోడ్ చేసే బాధ్యతను అప్పగించడంపై ఆక్షేపించింది. ఎన్నికల వ్యవహారాలకు వలంటీర్లు దూరంగా ఉండాలని ఈసీ కూడా స్పష్టం చేసింది. వలంటీర్లు.. ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా తమపని తాము కానిచ్చేస్తున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు నుంచి అన్ని అంశాల్లోనూ వేలు పెడుతున్నారు. అయితే కొన్నిచోట్ల వలంటీర్లు… కుటుంబ వ్యవహారాల్లోనూ చోటు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి పలు పోలీస్ స్టేష న్లలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడిదే అంశాన్ని పవన్ వారాహి -2లో టార్గెట్ చేశారు. అంతే కాదు వలంటీర్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి.
క్షేత్రస్థాయిలో వైసీపీ కార్యక్రమాలను కూడా వలంటీర్లు మేనేజ్ చేస్తునన్నారు. వైసీపీ సభకు లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసే సభలకు జనాలు రాకపోతే వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్నారు. వివిధ పథకాలకు లబ్దిదారులను సిఫారసు కూడా చేస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకు వలంటీర్లు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే వలంటీర్లు పలు క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. తమ రాజకీయ కక్ష సాధింపులకు సైతం వలంటీర్లను పావుగా వాడుకుంటున్నదనే విమర్శలు ఉన్నాయి. చివరికి జగన్ కు చెందిన సాక్షి పత్రిక కాపీ కొనుగోలులో కూడా కూడా వలంటీర్లను వాడుకుంటున్నది. వారి పేరుతో డబ్బులు తమ ఖాతాలో జమ చేసుకుంటున్నది. ఈ వ్యవస్థ చేసిన దురాగతాలన్నీ బయటకు రావాల్సిన సమయం దగ్గర పడిందన్న అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి.