Pawan Kalyan – Amit Shah బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం భేటీ అయ్యారు. ఎన్డీఏ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్, మీటింగ్ అయ్యాక కూడా అక్కడే ఉన్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై ఆయన ఈ భేటీలో ప్రస్తావించినట్లు విశ్వసనీయ సమాచారం. ఏపీలో రానున్న ఎన్నికలు, అధికార పార్టీ ఆగడాలు తదితరాలపై పవన్ కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. పవన్ తో పాటు కీలకనేత నాదెండ్ల మనోహర్ కూడా ఈ భేటీలో ఉన్నారు. అరగంటకు పైగా ఈ సమావేశం జరిగినట్లు సమాచారం.
అయితే సమావేశం వివరాలను ఇరువర్గాలు వెల్లడించలేదు. కేవలం అమిత్ షాతో భేటీ జరిగినట్లు మాత్రం పవన్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఏపీ ప్రగతి, ప్రజలకు నిర్మాణత్మక భవిష్యత్ అందించేందుకు ఈ సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. మరో వైపు ఏపీలో కూటమి బలోపేతం పై చర్చించామని బీజేపీ నేత మురళీధరన్ ట్వీట్ చేశారు. అంతకుముందు ఏపీ బీజేపీ ఇన్చార్జి మురళీధరన్ ను జనసేన అగ్రనేతలు కలిశారు. ముఖ్యంగా ఏపీలో పొత్తల అంశంపైనే చర్చ జరిగిందని, వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు తమతో కలిసి రావాలని జనసేనాని వారిని కోరినట్లు సమాచారం. మరోవైపు ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై ఏపీ పోలీసుల తీరును కూడా ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. ఏపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులను కేసుల పేరిట ఇబ్బందులకు గురి చేస్తు్న్నదని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని ఈ సందర్భంగా తెలిపినట్లు సమాచారం.
అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. రాష్ర్టంలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు అంతా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అయితే బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో బంధాన్ని ప్రస్తావించడం లేదు. అయితే జనసేన అధినేత మాత్రం వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ బీజేపీ కలిసిరాకున్నా పవన్ మాత్రం టీడీపీతో కలిసి వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏపీలో బీజేపీకి అంత ఓటు బ్యాంకు లేదు. టీడీపీతో కలిస్తేనే వైసీపీని ఢీకొట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు తో వెళ్దామని బీజేపీ నేతలకు పవన్ చెప్పినట్లు సమాచారం.