
రేవంత్ రెడ్డి ఎప్పుడు అగ్రెసివ్‌గా ఉండే లీడర్. విషయమేదైనా ముక్కుసూటితత్వం ఆయన నైజం. ఒక విధంగా రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డిలా కేసీఆర్ సర్కార్‌పై పోరాటం చేసే నాయకుడు లేరనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు కేసీఆర్‌కు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. రేవంత్ ఎక్కడా మెతక వైఖరిని ప్రదర్శించలేదు. వెనకడుగు వేయలేదు. ఎక్కడా సింపాతీ కోసం సెంటి మెంట్ రాజకీయాలు చేయలేదు.
కానీ,రేవంత్‌పై మాజీ మంత్రి,బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ శనివారం చేసిన కామెంట్స్‌పై ఆయన అగ్రెసివ్‌గా స్పందించారు. రాజేందర్ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి రూ.25 కోట్లు ముట్టాయని చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో ఈటల రాజేందర్‌కు ఒక ప్రామినెంట్ నాయకుడు అనే పేరుంది. అలాంటి నేత తనపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడాన్ని రేవంత్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు.
అందులో భాగంగానే రేవంత్ ఎన్నడు లేని విధంగా సెంటిమెంట్ రాజకీయానికి తెర లేపారు. ఈటలకు భాగ్యలక్ష్మీ టెంపుల్ వేదిక సవాల్ విసిరారు. అమ్మవారి ఆలయం వద్దే రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కన్నీటి పర్యంతమయ్యారు. కేసీఆర్‌పై మొక్కవోని ధైర్యంతో పోరాడుతున్న తనపై ఈటల చేసిన కామెంట్స్‌ను గుర్తు చేస్తూ..తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎప్పుడు అగ్రెసివ్‌గా ఉండే రేవంత్ రెడ్డి ఇలా కన్నీటి పర్యంతమవడం ఇదే మొదటిసారి కావొచ్చు.
అయితే రేవంత్ ఈరకమైన సెంటిమెంట్ రాజకీయాలకు ఎందుకు తెరలేపాడనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయ మైలేజ్ కోసమే సింపాతీ పాలిట్రిక్స్ కు రేవంత్ తెర లేపి ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రేవంత్ కొత్తగా ఎంచుకున్న ఈ విధానాలతో ఆయనకు ఏ మేరకు లబ్ధి చేకూరుతోందనేది మాత్రం వేచి చూడాల్సిందేనం టున్నారు రాజకీయ విశ్లేషకులు.






