అతిగా సెల్ ఫోన్ వాడుతున్నారా ? వింత జబ్బులకు లోనవ్వడం ఖాయం. స్మార్ట్ యుగంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ సెల్ ఫోన్ కు అడిక్ట్ అయ్యారు. ఫోన్ వచ్చినా ,రాకున్నా అదేపనిగా ఫోన్ వచ్చిందేమో అన్న భ్రమల్లో ప్రతీ సారి సెల్ ఫోన్ చేసుకోవడమే కాకుండా చీటికీ మాటికీ సెల్ ఫోన్ లో యూట్యూబ్ లను , అమెజాన్ , నెట్ ఫ్లిక్స్ , ఆహా తదితర ఫ్లాట్ ఫామ్ లలో వచ్చే సినిమాలను చూస్తూ 24 గంటల సమయంలో దాదాపు 16 నుండి 18 గంటల పాటు చేతిలోనే సెల్ ఫోన్ ఉంటోంది దీనివల్ల రకరకాల దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
భార్యాభర్తలు , ప్రేమికులు , ఒక కుటుంబంలోని అన్ని రకాల వయసు వాళ్ళు ఒక చోట ఉన్నప్పటికీ కలిసి మాట్లాడుకుంటున్నప్పటికీ అది యాదృశ్చికంగా ఏదో జరిగిపోతుంది తప్ప మనసు లోంచి వచ్చే మాటలు కావడం లేదు ఎందుకంటే ఒకవైపు మాట్లాడుతూనే మరోవైపు చేతిలో ఉన్న ఫోన్ లో వాట్సాప్ చూడటమే ఇందుకు కారణం. వాట్సాప్ మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. భార్యతో కాపురం చేయడం ఏంటో కానీ సెల్ ఫోన్ తో అందునా వాట్సాప్ తోనే కాపురం చేసే మహానుభావులు కోకొల్లలుగా తయారయ్యారు ఈ సమాజంలో. సెల్ ఫోన్ మానవ సంబంధాల మధ్య ఒక అడ్డుగోడలా నిలిచింది. ఇంట్లో ఉన్న వాళ్లతో ప్రేమగా , సంతోషంగా మాటాడటం రాదు కానీ సెల్ ఫోన్ లో అలాగే వాట్సాప్ లో ఫేస్ బుక్ లో మాత్రం లేనిపోని ప్రేమని కురిపిస్తుంటారు అది కూడా కొంతమందికి ముక్కు మొహం తెలియని వాళ్ళతోనే ఆన్ లైన్ పరిచయాలు అన్నమాట. అలాగే ఫోన్ లో నిమిషాల తరబడి , గంటల తరబడి మాట్లాడతారు కానీ కుటుంబ సభ్యులతో మాత్రం ఒక్క నిమిషం సంతోషంగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది.
ఈ కారణాలు మాత్రమే కాదు సుమా సెల్ ఫోన్ అతిగా వాడటం వల్ల అనేక రకాల సమస్యలు రావడమే కాకుండా అనారోగ్య బారిన పడటం కూడా ఖాయం. పక్కన ఉన్న మనుషులతో మాట్లాడకుండా ఒంటరిగా సెల్ ఫోన్ తోనే కాలక్షేపం చేసేవాళ్లకు తర్వాతి రోజుల్లోనే ఒంటరి తనమే మిగిలేది. అందుకే ఇప్పటికైనా సెల్ ఫోన్ వాడకం తగ్గించి కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయండి. భార్యాపిల్లలతో సరదాగా గడపండి…… కరోనా పాండమిక్ ని అధిగమించండి.






