
తెలంగాణ మంత్రి వర్గం నుండి బర్తరఫ్ కు గురైన ఈటల రాజేందర్ కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈటల రాజేందర్ తన ట్విట్టర్ అకౌంట్ లో కొత్తగా పెట్టిన పిక్ ఈ అంశాన్ని రుజువు చేస్తోంది. తెలంగాణ చిత్రపఠంలోంచి పిడికిలి బిగించిన చేయి పైకి వస్తున్న ఫోటోని పెట్టడమే కాకుండా జ్యోతి రావు పూలే , బాబా సాహెబ్ అంబెడ్కర్ , ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటోలను ఒకవైపున పెట్టి మరోవైపున తల్లి తెలంగాణ , అమరవీరుల స్థూపం ఫోటోలను పెట్టించాడు. ఈ మొత్తాన్ని ఒక డిజైన్ గా చేయించి తన ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు దాంతో రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగింది.
కబ్జా ఆరోపణల మీద సీనియర్ మంత్రి అయిన ఈటల రాజేందర్ ని తన మంత్రి వర్గం నుండి తొలగించారు కేసీఆర్. ఆ తర్వాత ఈటల ని ఒంటరి చేయడానికి తన మేనల్లుడు హరీష్ రావు ని కూడా రంగంలోకి దించాడు. అయితే ఈటల మాత్రం కేసీఆర్ ప్రభుత్వంపై పెద్దగా విరుచుకుపడకుండా బీజేపీ , కాంగ్రెస్ నేతలను మాత్రం కలిశారు. ఒకవేళ హుజురాబాద్ లో ఉప ఎన్నిక వస్తే నాకు మద్దతు ఇవ్వాలని ఆయా రాజకీయ పక్షాలను కోరినట్లు ప్రచారం సాగుతోంది. ఈటల రాజేందర్ స్వతంత్య్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా తన ప్రొఫైల్ పిక్ లో రకరకాల అంశాలను చేర్చడం ద్వారా ఆత్మగౌరవ పోరాటం నాది అంటూనే సొంత రాజకీయ పార్టీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని ప్రచారం సాగుతోంది. ఇక ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చేలా త్వరలోనే ఢిల్లీ పర్యటన కూడా చేస్తుండటంతో తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ రానుందా ? అన్న చర్చ జరుగుతోంది. అధికారం , అంగబలం పుష్కలంగా ఉన్న కేసీఆర్ ని ఈటల ఒంటరిగా ఎదుర్కోవడం అంటే కష్టమే ! కానీ ఈటల మాత్రం కేసీఆర్ తో యుద్ధమే అని అంటున్నాడు. చూడాలి ఎవరి రాత ఎలా ఉందొ ?