సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ రోజు ఎలాంటి ప్రయాణమూ చేయకూడదన్నది పెద్దల మాట. అయితే కొంతమంది ముక్కనుమ నాడు కూడా ప్రయాణం చేయకూడదని చెబుతూ ఉంటారు. మరి ఈ మాటలో వాస్తవం ఎంత ?
నిజానికి ముక్కనుమ పండుగ ఈమధ్యకాలంలోనే మొదలైన సంప్రదాయం. ఒకప్పుడు సంక్రాంతి కేవలం మూడు రోజుల పండుగగానే ఉండేది. సంక్రాంతి ముందు రోజు భోగిని కీడు పండుగగా భావిస్తారు. ఈరోజు భోగిమంటలు వేయడం, భోగిపళ్లు పోయడం, బొమ్మల కొలువు పెట్టడం వంటి పనులు చేస్తారు. వీటితో జీవితంలో ఉన్న చెడు అంతా వెళ్లిపోయి భోగభాగ్యాలు వస్తాయని నమ్ముతారు. అందుకే దీనికి భోగి అన్న పేరు వచ్చింది.
సంక్రాంతి రెండో రోజుని, మార్పుకి సూచనగా భావిస్తారు. చేతికి అందిన పంటలతో పిండివంటలు చేసుకొని దేవతలకు కృతజ్ఞత చెబుతారు. పనిలోపనిగా పితృదేవతలని కూడా తల్చుకుంటారు. అందుకే ఈ రోజుకి పెద్దల పండుగ అన్న పేరు కూడా ఉంది.
ఇక సంక్రాంతి మూడో రోజు కనుమ పశువుల పండుగ. ఈ రోజు పశువులని అలంకరించి, వాటికి మంచి ఆహారాన్ని అందిస్తారు. గారెలు, వండి వాటిని పితృదేవతలకు నివేదన చేస్తారు.
ఇలా కనుమతోనే సంక్రాంతి సంప్రదాయాలన్నీ పూర్తయిపోతాయి. అందుకనే శాస్త్ర ప్రకారం అసలు ముక్కనుమ అన్న పండుగే లేదు. కాకపోతే కనుమ మర్నాడు గ్రామదేవతలకు బలులిచ్చి, మాంసాహారాన్ని వండుకునే ఆచారం మాత్రం ఉంది. అదే క్రమంగా ముక్కనుమగా మారింది. అందుకే ఈ రోజుని ముక్కల కనుమ అని కూడా పిలుస్తారు. అంతేకానీ ఈ రోజున ప్రయాణాలు చేయకూడదు అని కానీ, పండుగ చేసుకుని తీరాలి అని కానీ ఖచ్చితమైన నియమాలు ఏవీ లేవు !
సంక్రాంతిని నాలుగురోజుల పాటు చేసుకోవడం తమిళనాడులో కనిపించే సంప్రదాయం. అక్కడ మొదటి రోజు భోగి అనీ, రెండో రోజు సంక్రాంతి అనీ మూడో రోజు మట్టు పొంగల్ అనీ పిలుస్తారు. ఈ మట్టుపొంగల్ రోజున పశువులని పూజించి, వాటితో ఆటలాడతారు. మనం ఎప్పుడూ వినే జల్లికట్టు ఆట ఈ రోజే జరుగుతుంది. ఇక మట్టుపొంగల్ మర్నాడే తమిళురు కనుమ పండుగని చేసుకుంటారు. ఈ రోజు వాళ్లు దూడలని పూజిస్తారు. తమ పెద్దల ఇళ్లకి వెళ్లి వాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటారు. అందుకని వాళ్లకి సంక్రాంతి నాలుగురోజుల పండుగ !
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
సర్వేజనాః సుఖినోభవంతు:
🌼 శుభమస్తు 🌼