Nominated Posts:2019 నుంచి ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం పాలించింది. ఈ ఐదేళ్లు కూడా టీడీపీపై ఆర్థిక, సామాజిక, భౌతిక దాడులు చేస్తూనే ఉంది. అయితే ఈ దాడులను బరించలేక కొందరు వైసీపీలోకి వెళ్లిపోక తప్పలేదు. కానీ కొందరు నాయకులు, కార్యకర్తలు మాత్రం టీడీపీని వీడలేదు. ఎన్ని దాడులు చేసినా భరిస్తూ వచ్చారు. తమ పార్టీని తామే రక్షించుకోవాలని అందుకు ఎక్కడికీ వెళ్లేది లేదని వైసీపీకి ఎదురొడ్డి పోరాడారు. వారి పోరాటాలు స్ఫూ్ర్తినిచ్చాయి. వారికి చంద్రబాబు ప్రభుత్వం వివిధ పదవులను ఇచ్చి రుణం తీర్చుకుంంది. ఇందులో భాగంగా పట్టాభికి.. అత్యంత ఇష్టమైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఛైర్మన్ పదవి ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం.
కొమ్మారెడ్డి పట్టాభిరామ్..
వైసీపీ చేతిలో భౌతికదాడులను, అక్రమ కేసులను, థర్డ్ డిగ్రీని ఎదుర్కొన్నా వెన్ను చూపకుండా పార్టీ కోసం నిలబడిన పట్టాభికి.. చంద్రబాబుకు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఐదేళ్లు పార్టీ గొంతుకను బలంగా వినిపించారు. వైసీపీ అరాచకాలకు ఎండగట్టారు.
మహ్మద్ షరీఫ్..
మూడు రాజధానుల బిల్లు అమోదానికి శాసన మండలిలో సభ్యులను వైసీపీ పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసింది. అయినా తట్టుకొని న్యాయం, ధర్మం వైపు నిలబడ్డారు మహ్మద్ షరీఫ్. చైర్మన్ గా ఉన్న ఆయనపైకి మంత్రులు, ఎమ్మెల్సీలు దాడికి యత్నించినా వెన్నుచూపకుండా ఉన్నారు. ఒకే రాజధాని కొనసాగాలన్న విషయంలో ఆయన చేసిన కృషి ఎనలేనిది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన మహ్మద్ షరీఫ్ టీడీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలోనే ఉన్నారు. ఎమ్మెల్సీగా, చైర్మన్ పనిచేశారు. పార్టీపై విధేయత, కీలక సమయంలో ఆయన ప్రదర్శించిన అంకిత భావం, విశ్వాసానికి ప్రతిఫలంగా కేబినెట్ హోదాతో కూడిన మైనారిటీ వ్యవహారాల సలహాదారు పదవి లభించింది.
ఆనం వెంకటరమణారెడ్డి..
వైసీపీ అరాచకాలను వ్యంగ్యంగా ఎండగడుతూ సామాన్యులకు చేరువవడంలో ఆయన దిట్ట. నాణ్యత లేని జే బ్రాండ్లు, బూమ్ బూమ్ బీర్ల గురించి జనాల్లోకి తీసుకెళ్లారు. మద్యం విధానంలో ముసుగును బయటపెట్టారు. టీడీఆర్ కుంభకోణం వంటి వాటిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన వ్యంగ్య విమర్శలు, వ్యాఖ్యల ధాటికి తాళలేక వైసీపీ మూకలు ఆయనపై దాడికి తెగబడ్డాయి. వాటిని తట్టుకొని పార్టీ వాణిని బలంగా వినిపించారు.
నీలాయపాలెం విజయ్‌కుమార్..
టీడీపీ అధికార ప్రతినిధిగా వైసీపీ ప్రభుత్వ కుంభకోణాలను బయట పెట్టడంలో బాగా పనిచేశారు. క్లిష్టమైన, మేధోపరమైన, సాంకేతిక అంశాలను సామాన్యులకు అర్థమయ్యేలా ప్రజల్లోకి తీసుకెళ్లారు. వైసీపీ దోపిడీని కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇందుకే ఆయనకు పదవి లభించింది.
ఎంవీ ప్రణవ్‌గోపాల్..
తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వైసీపీ అరాచకాలు, అక్రమాలపై పోరాడారు. జీవో 77 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది స్టూడెంట్స్ తో అప్పటి సీఎం జగన్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసుల ఆంక్షలను దాటుకొని కార్యక్రమంను విజయవంతం చేశారు. ఈ కేసులో కొన్నేళ్లు జైల్లో కూడా ఉన్నారు. రుషికొండ ప్యాలెస్ ముట్టడి చేపట్టారు. భవిష్యత్ నాయకుడిగా ఎదిగేందుకు వీఎంఆర్‌డీఏ చైర్మన్ పదవి ఇచ్చినట్లుగా కనిపిస్తోంది
తేజస్వి పొడపాటి..
తెలుగు ప్రొఫెషనల్స్ విభాగం అధ్యక్షురాలైన తేజస్వి పొడపాటి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వ అరాచకాలను తనదైన శైలిలో చలోక్తులు, ప్రాసలు, ఉదాహరణలతో వివిధ వేదికలపై నిలదీశారు. మళ్లీ బాబే సీఎం కావాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగించేలా ప్రసంగాలు చేశారు. బాబు అరెస్టు సమయంలో ఐటీ ఉద్యోగులతో కలిసి హైదరాబాద్‌లో నిరసనలు చేపట్టారు. ధర్నాలు, ర్యాలీలు, కొవ్వొత్తుల చలో రాజమహేంద్రవరం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో ‘సీబీఎన్ గ్రాటిట్యూడ్’ పేరుతో భారీ సభ కొనసాగింది. ఆమె పనితీరుకు ప్రతిఫలంగా ఈ పదవి లభించింది.
గుమ్మడి గోపాలకృష్ణ..
టీడీపీలో అంకిత భావం, నిబద్ధత ఉన్న కార్యకర్తగా గుర్తింపు పొందారు. బాబు జైలులో ఉన్న సమయంలో అక్రమ అరెస్టును నిరసిస్తూ పాటలు రాశారు. ప్రచారానికి ఉపయోగపడేలా పాటలను సిద్ధం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు. నాటక అకాడమీ చైర్మన్ గా పదవి నిర్వహించారు.
రావి వెంకటేశ్వరరావు..
మొదటిన నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్నారు. 2000లో గుడివాడ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గెలిచి నాలుగేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో ఓటమి పాలయ్యారు. ఆయనకు కాకుండా ఇతర నాయకులకు టికెట్ ఇచ్చినా కూడా వారి గెలుపునకు చిత్తశుద్ధితో పనిచేసేవారు. పోటీకి అవకాశమిచ్చినా.. ఇవ్వకపోయినా.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పని చేసేవారు. గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా వ్యవహరించారు. విధేయత, పార్టీ పట్ల నిబద్ధత చూపినందుకు ఆయనకు పదవి దక్కింది.
చేర్రెడ్డి మంజులా రెడ్డి:
వైసీపీ హయాంలో ఆటవిక సామ్రాజ్యంగా మారిన మాచర్ల నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సోదరుల అక్రమాలు, అరాచకాలు, దాడులకు మంజుల ఎదురొడ్డి నిలుచున్నారు. రెంటచింతల మండలం, రెంటాలలో టీడీపీ తరఫున పోలింగ్ ఏజెంట్‌గా ఉండేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఆమెపై వైకాపా రౌడీ మూకలు, కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. నుదురు భాగం చీలిపోయింది. పదుల సంఖ్యలో రౌడీ మూకలు చుట్టుముట్టినా, తలంతా నెత్తురోడుతున్నా ఆమె వెనక్కి తగ్గలేదు. వారిని దీటుగా ఎదుర్కొని హాస్పిటల్ కు కాకుండా గాయాలతోనే పోలింగ్ కేంద్రానికే వెళ్లి ఏజెంట్‌గా కూర్చున్నారు. పోలీసులు స్పందించకపోయినా రిగ్గింగ్ జరగకుండా నిలువరించగలిగారు. ఆమె చూపిన సాహసం, తెగువ సంచలనమైంది. అందుకు ప్రతిఫలంగా ఎవరూ ఊహించని రీతిలో మంజులా రెడ్డికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇచ్చారు.