
KCR VS Revanth : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తిస్థాయి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వ్యక్తిగా ఓ పత్రిక అధిపతి పేరు సోషల్ మీడియా సర్కిళ్లలో నడుస్తున్నది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తూ, ప్రభుత్వం చర్యలను ఎప్పటికప్పుడు కథనాలు వడ్డిస్తూ ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఎంతో పేరు సంపాదించుకున్నది. ఎంతలా అంటే రెండు ప్రభుత్వాలు కూడా ఆ పత్రికకు యాడ్స్ ఆపేశాయంటేనే ఆయనను ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతున్నది.
అయితే ముందు నుంచి ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ఎండి రాధాకృష్ణ ఫైర్ మోడ్ నే కొనసాగిస్తున్నారు. దమ్మున్న ఛానల్ దమ్మున్న పత్రిక అంటూ పత్రికను దైన శైలిలో నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం తన కాలంలో కొత్త పలుకు అంటూ రాసే వ్యాసం ఇప్పటికీ చాలామందిని చదివిస్తుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల, ప్రతిపక్షాల తీరును ఎండగడుతూ ఆయన వ్యాసాలు ఉంటాయి.
గతవారం పూర్తిస్థాయిలో కేసీఆర్ ను టార్గెట్ చేసిన కొత్త పలుకు ఈ వారం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలలో చెప్పడంతో పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్లాలో మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడిలా సలహాలు ఇచ్చారు. దీంతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణలో మిత్ర బంధాన్ని కొనసాగిస్తున్నాయని చెప్పేందుకు ఆర్కే ప్రయత్నించారు
. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంటున్నదని, రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. అయితే సీనియర్లందరినీ ఆయన కలుపుకొని పోవాలని, ఒంటెద్దు పోకడలకు పోతే మొదటికే నష్టం వస్తుందని సూచించారు. జగ్గారెడ్డి, జానారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్లను మిత్రులుగా చేసుకుంటేనే రేవంత్ రెడ్డికి లాభం ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే రేవంత్ రెడ్డికి సలహాలు ఇవ్వడం లో భాగంగా బీఆర్ఎస్ ఎంత బలంగా ఉందో వాటిపై ఎలా దృష్టి పెట్టాలో రాధాకృష్ణ తనదైన శైలిలో సూచనలు చేశారు.
ఎంఐఎంతో సాన్నిహిత్యంగా ఉంటున్న కారణంగా ముస్లింలు బీఆర్ఎస్ ను ఆదరిస్తున్నారని, అయితే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత ఇప్పుడు అందరి చూపు తెలంగాణలో కాంగ్రెస్ వైపే ఉందని తెలిపారు. ఇదే సమయంలో కమ్మ సామాజిక వర్గాన్ని కూడా తనవైపు తిప్పుకునేందుకు రేవంత్ ప్రయత్నించాలని సూచించారు సుమారు 25 నియోజకవర్గాల్లో కమ్మ సామాజికవర్గం గెలుపోటములను శాసిస్తున్నదని, వారిని మచ్చిక చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఒక పొలిటికల్ స్ట్రాటజిస్టులా కాంగ్రెస్ పార్టీకి సూచనలు ఇచ్చారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ విషయంలో సైలెంట్ గా ఉన్న కారణంగా బీజేపీ తన చెట్టును తానే నరికేసుకున్నదని, శ్రేణుల్లో నిరాశ నెలకొని ఉందని చెప్పుకొచ్చారు ఇప్పటికైనా మించిపోయింది లేదని కేసీఆర్ ను కేసులతో కట్టుదిట్టం చేస్తే బీజేపీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని సలహా ఇచ్చారు. కేసీఆర్ ను ఎలాగైనా ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు ఇంతగా శ్రమిస్తున్నాయో లేదో కానీ రాధాకృష్ణ మాత్రం తన వ్యాసాల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే కొంతమేర పుంజుకున్న కాంగ్రెస్ పార్టీకి తన మీడియా ద్వారా సూచనలు సలహాలు ఇస్తూ మరింత పాజిటివ్ వార్తలు వార్చి వడ్డించేలా చూస్తున్నారు. ఆర్కే తన కొత్త పలుకులో ఎక్కువ శాతం ఇంతకుముందు ఏపీ సీఎం జగన్ ను తిట్టేందుకు, వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు కేటాయించేవారు. ఇప్పుడు తెలంగాణపై కూడా ఆయన దృష్టి పెట్టారు. ఏదేమైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్కే ప్రతిపక్ష నాయకుడిలా పాత్ర పోషిస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. కొంతమంది ఆర్ కే ను సమర్థిస్తుంటే మరి కొంతమంది సోషల్ మీడియాలో వ్యాఖ్యలతో తిట్ల దండకం అందుకుంటున్నారు. ఏదేమైనా ఆర్కే రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టడం ద్వారా ప్రభుత్వాధిపతుల కోపానికి కారణం అవుతున్నారు. రానున్న రోజుల్లో రాధాకృష్ణకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈనాడు విషయంలో మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంతీరుతో అదే జరుగుతున్నది. మరి రానున్న రోజుల్లో రాధాకృష్ణ పరిస్థితి కూడా అంతే కావచ్చు. అయినా వెనక్కి తగ్గనని రాధాకృష్ణ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డిని అధికారంలోకి తెచ్చేందుకు రాధకృష్ణ ఈ ఐదు నెలలు కఠోరంగాశ్రమించేలాగే కనిపిస్తున్నారు. ప్రతి ఆదివారం తన వ్యాసాలతో ఇటు కేసీఆర్, అటు జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఇంతకీ ఈ రిటర్న్ గిఫ్ట్ ఎవరికి అందుతుందో చూడాలి.
ReplyForward
|