Rakesh master : రాకేశ్ మాస్టర్ భారతీయ సినిమా కొరియోగ్రాఫర్. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. ఆయన అసలు పేరు ఎస్ రామారావు. 1968వ సంవత్సరంలో తిరుపతి ప్రాంతంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులకు ఏడుగురు సంతానం అందులో నలుగురు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. హైదరాబాద్‌లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం కొరియోగ్రాఫ్ చేశాడు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి టాప్ కొరియోగ్రాఫర్లకు శిక్షణ ఇచ్చింది రాకేశ్ మాస్టరే. వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష మొదలైన సినీ నటులు రాకేశ్ మాస్టర్ శిష్యులే. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు మొదలైన సినిమాలకు రాకేశ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈటీవీ వేదికగా ప్రారంభమైన ఢీషోలో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్‌గా వ్యవహరించాడు. వీటితో పాటు జబర్దస్త్ కామెడీ షోకి సంబంధించి పలు ఎపిసోడ్లలో పార్టిసిపెంట్‌గా ఆయన పాల్గొన్నాడు.
ఇండస్ట్రీలో వీరితో వివాదం..?
రాకేశ్ మాస్టర్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. కొన్ని యూట్యూబ్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలు వివాదాస్పదంగా మారాయి. రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్, మోహన్ బాబు, మంచు లక్ష్మి, చిరంజీవిలను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపాయి. రాకేశ్ మాస్టర్ పై ఆయన శిష్యుడు పుల్లయ్య చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇంకా హిందూ దేవుడైన శ్రీకృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై యాదవ సంఘం భగ్గుమంది. 2021లో హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చారు యాదవులు.
గత కొంత కాలం నుంచి ఆయన తరుచూ అనారోగ్యానికి గురవుతూ వస్తున్నారు. ఈ మధ్య మరీ ఆరోగ్య పరంగా మరింత దిగజారినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఆయనకు చాలా కాలం క్రితం డయాబెటిక్ అటాక్ అయ్యింది. అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నా.. అప్పుడప్పుడూ మాత్రం కట్టు తప్పుతున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఈవెంట్ కు వెళ్లిన ఆయన బాగా సిక్ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన తర్వాతి రోజు రక్త విరేచనాలు కావడంతో హాస్పిటల్ కు తరలించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్ కావడం వల్ల తుదిశ్వాస విడిచారు.
|
ReplyForward
|






