Undavalli Petition in High Court : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఇప్పటికే ఏపీని వణికిస్తున్నది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరెస్టవడం, రాజమండ్రి జైలులో 12 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉండడం సంచలనంగా మారింది. ఒక వైపు దేశవిదేశాల్లో ఇది అక్రమ కేసు అంటూ ఆందోళనలు కొనసాగుతుండగా, దీనిని సీబీఐ, ఈడీకి అప్పగించాలంటూ మరో పిటిషన్ కోర్టులో దాఖలవడం మరింత కలకలం రేపింది.
మార్గదర్శిపై వివిధ కేసులు పెట్టి సంచలనంగా మారిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమారే స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో సీబీఐ, ఈడీ విచారణ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది హై ప్రొఫైల్ కేసు కావడం, విచారణ అత్యంత సంక్లిష్టంగా ఉండే అవకాశం ఉన్నందున కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు, సీబీఐ, ఈడీ, మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సహా 44 మందిని చేర్చారు. అయితే ఏపీ హైకోర్టులో ఈ పిటిషన్ కు ఇంకా నంబరింగ్ ఇవ్వనట్లు సమాచారం.
మార్గదర్శి చిట్ ఫండ్స్ విషయంలోనూ మాజీ ఎంపీ ఉండవల్లి మొదటి నుంచి పోరాడుతున్నారు. ఆయన మార్గదర్శి చైర్మన్, ఈనాడు అధినేత రామోజీరావుకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. గతంలో రామోజీపై ఏకంగా పోరాటమే ప్రకటించారు. అయితే మాజీ ఎంపీ ఉండవల్లి గత కొంతకాలంగా రాజకీయ అంశాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం ఏపీ ప్రయోజనాలపైనే మాట్లాడుతున్నారు. కాగా, ఇటీవల వైసీపీ అధినేత జగన్ ను కలిశారని టాక్ బయటకు వచ్చింది.
అయితే తాజాగా ఈ పిటిషన్ వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉండి ఉంటుందనే అభిప్రాయం కూడా వినిపిస్తున్నది. ఏదేమైనా ఇప్పుడు ఉండవల్లి వేసిన ఈ పిటిషన్ రాష్ర్ట రాజకీయాలకు మరో సంచలనంగా మారబోతుందా అనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఒకవేళ హైకోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తే, సీబీఐ, ఈడీలకు ఈ కేసు అప్పగిస్తే పరిస్థితి ఏంటా అనే అయోమయంలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి.