KCR దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలకు అధికార, ప్రతిపక్షాలన్నీ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బలప్రదర్శన చేసేశాయి. ఎవరు ఎటువైపు అనేది ఇప్పటికే తేలిపోయింది. అధికారపక్షం తరఫున కూటమి, ప్రతిపక్షాల తరఫున కూటమి ఇప్పటికే ఖరారైంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా బీజేపీకి వ్యతిరేక కూటమి అంటూ హడావుడి చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఇప్పుడు సైలెంట్ అయ్యారు. భారతీయ రాష్ట్ర సమితి అంటూ పార్టీ పెట్టి ఇక జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం మేమే అంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్ ఇప్పుడు మౌనంగా ఉండిపోయారు. ఆయన వైపు నిలబడేందుకు ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు. ఆయన కూడా ఏ కూటమిలో చేరుతారో ఇంకా తేల్చుకోలేకపోయారు. ఆయనను నమ్మకపోవడమే కారణమని కొందరు భావిస్తున్నారు.
బీహార్, బెంగళూరులో రెండు విడుతలుగా సాగిన ప్రతిపక్ష కూటమి సమావేశానికి కేసీఆర్ తో సన్నిహితంగా ఉన్న చాలా మంది నేతలు హాజరయ్యారు. ఇప్పుడు ఇదే కేసీఆర్ ను డైలామాలో పడేసింది. ఇక జాతీయ స్థాయిలో చక్రం తిప్పబోతున్నామంటూ కేసీఆర్ గతంలో మాట్లాడారు. కానీ ఇప్పుడు ఇలాంటి సమయంలో ఆయన కేవలం ఫామ్ హౌజ్ కే పరిమితమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఆయన దృష్టి పెట్టారు. గత ఐదు రోజులుగా కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లోనే ఉన్నారు.
ఎన్నికలకు ఎలా సమాయత్తం కావాలనే విషయంపై ఆయన కీలక నేతలతో చర్చిస్తున్నారు. తెలంగాణలో సచివాలయం నిర్మాణం తర్వాత ఆయన ఇటీవల ఫామ్ హౌస్ కి వెళ్లలేదు. ఇప్పుడు మాత్రం అక్కడే ఉన్నారు. ఐదు రోజులుగా ఫామ్ హౌస్ లో కి ఎవరినీ ఎంటర్ కానివ్వలేదు. కనీసం ఏ ఒక్కరికీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో కేసీఆర్ ఉన్నారని కొందరు భావిస్తుంటే, జాతీయ రాజకీయాలపై వ్యూహాలకు పదును పెడుతున్నారని మరికొందరు అంటున్నారు. అయితే జాతీయ స్థాయిలో యుద్ధం చేయాలంటే తనతో వచ్చేవారిని కలుపుకోవాలని, లేదంటే తానే కొందరితో కలవాలని, ఇలా ఒంటరిగా ఫామ్ హౌస్ లో కూర్చుంటే ఏం లాభమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే బీజేపీ, కాంగ్రెస్ లకు కేసీఆర్ ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ఆయన బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. మరోవైపు రాష్ర్టంలో కాంగ్రస్ బలంగా పుంజుకుంటున్నది. ఈ సమయంలో ఆయనను మీటింగ్ కు పిలిస్తే బాగోదని కాంగ్రెస్ భావిస్తున్నది. బీజేపీ కూడా కొంతకాలంగా ఆయనపై మాటల దాడిని ఆపేసింది. ఇక కేసీఆర్ దారి ఎటనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే సీఎం కేసీఆర్ మాత్రం జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటూనే బీజేపీకి దగ్గరవుతున్నట్లు తెలుస్తున్నది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పాత్రపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన కొంత వెనక్కి తగ్గినట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికైతే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఒంటరిగానే కనిపిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఆయన ఏ కూటమి వైపు నిలబడుతారో వేచిచూడాలి.