
లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. తాజాగా అమితాబ్ బచ్చన్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ” ప్రాజెక్ట్ – K ” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అమితాబ్ బచ్చన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
ఆ సమయంలో అమితాబ్ కాస్త తూలి కిందపడ్డాడట. వయసు రీత్యా పెద్ద వయసు కావడంతో ఎముకలకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. పెద్దాయన కాబట్టి హుటాహుటిన గచ్చిబౌలి లోని ఆసుపత్రికి తరలించారట. అక్కడ ప్రాధమిక చికిత్స తీసుకున్న తర్వాత ముంబై వెళ్ళాడు అమితాబ్.
ప్రస్తుతం ముంబైలోని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే అమితాబ్ బచ్చన్ కు తీవ్ర గాయాలు అయ్యాయని ఊహాగానాలు వెలువడటంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు అమితాబ్ అభిమానులు. ఈ వార్త దావానలంలా వ్యాపించకముందే స్పందించాలని భావించిన నిర్మాత అశ్వనీదత్ ప్రమాద వార్తలను ఖండించాడు. షూటింగ్ లో ఎలాంటి ప్రమాదం జరగలేదని , అమితాబ్ కు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపాడు. అయితే పెద్దగా గాయాలు కాకపోయినప్పటికీ అమితాబ్ కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. అమితాబ్ వయసు 80 సంవత్సరాలు కావడంతో సహజంగానే కాస్త చురుకుదనం తగ్గుతుంది ….. యాక్షన్ దృశ్యాల్లో సహజంగానే ఇబ్బంది కలగడం ఖాయమని అంటున్నారు పలువురు.