
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఖలేజా చిత్రంలో విలన్ పాత్రలో నటించిన నటుడు అమన్ ధలివాల్. పంజాబీ నటుడైన అమన్ తాజాగా అమెరికాలో ఉన్నాడు. కాగా అతడిపై ఓ ఆగంతకుడు కత్తిపోట్లకు తెగబడ్డాడు. ఛాతి , మెడ , తల , భుజం పై కత్తిపోట్లు పడ్డాయి దాంతో అమన్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు అమన్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
గురువారం ఉదయం కాలిఫోర్నియాలోని ఓ జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు అమన్. జిమ్ లోకి వచ్చిన ఆగంతకుడు అమన్ ను బందీగా చేసుకొని జిమ్ లో ఉన్న మిగతావాళ్లను బెదిరిస్తూ మంచి నీళ్లు కావాలని డిమాండ్ చేసాడు. అదే సమయంలో అమన్ ఆ ఆగంతకుడిపై ఎదురు తిరిగాడు. అయితే ఆగంతకుడి చేతిలో పదునైన కత్తి ఉండటంతో విచక్షణారహితంగా పోట్లు పొడిచి పారిపోయాడు. దాంతో అమన్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే జిమ్ లోని మిగతావాళ్ళు అమన్ ను ఆసుపత్రికి తరలించారు. అమన్ తెలుగులో ఖలేజా తో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించాడు అలాగే జోధా అక్బర్ తో సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించాడు.