
ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. చిన్న చిత్రంగా వచ్చిన ” ది కశ్మీర్ ఫైల్స్ ” ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. కేవలం 11 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 340 కోట్ల వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ఆ విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.
తాజాగా మరో వివాదాస్పద చిత్రానికి శ్రీకారం చుట్టాడు ఈ దర్శకుడు. ” ది వాక్సిన్ వార్ ” అనే టైటిల్ తో కొత్త సినిమా తీయనునట్లు ప్రకటించిన వివేక్ అగ్నిహోత్రి ఈరోజు ఆ సినిమాను ప్రారంభించాడు. ది వాక్సిన్ వార్ రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుండి ప్రారంభమైంది. కరోనా కష్టకాలంలో యావత్ ప్రపంచం ఎంతలా భయానికి లోనయ్యిందో అందరికీ తెలిసిందే.
అదే అంశాన్ని ఎంచుకుంటాడా ? లేక మరో అంశమా ? అన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది. మొత్తానికి ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం ఎంతటి వివాదాన్ని సృష్టించిందో ది వాక్సిన్ వార్ కూడా అంతటి వివాదాన్ని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని 2023 ఆగస్టు లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండటం విశేషం.